హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ) : నగరంలోని ఉప్పల్ భగాయత్‌లో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టే క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలోపు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని అధికారులను సాంఘిక, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, రంజాన్ నాటికి మకామసీదు, జామియా నిజామియా, అనిసుల్ గుర్బా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. కాగా, మైనార్టీ కార్పొరేషన్ రుణాల కోసం 2.16లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, మైనార్టీ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీమ్, ఎండీ కాంతి వెస్లీ, డైరెక్టర్ షఫీవుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.