హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ‘మాకు న్యాయం ఎప్పుడు చేస్తరో, మాకు ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకొంటారో చెప్పండి’ అంటూ కౌలు రైతులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే తమకు లాభం జరుగుతుందని భావించామని, కానీ అన్యాయమే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న కౌలు రైతులు అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన కురువ మంజుల మాట్లాడుతూ.. ‘2022లో భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు స్వయంగా రాహుల్‌గాంధీని కలిసి నా బాధ చెప్పుకున్నాను. కౌలు రైతులకు తప్పక సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేను ఇప్పటికీ కౌలుకు భూమి పట్టుకొని వ్యవసాయం చేస్తున్నా. కానీ మాకు రైతుభరోసా కానీ, పంట రుణాలు కానీ, ఎటువంటి పథకాలు కానీ రావడం లేదు. మాకు న్యాయం ఎప్పుడు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రాహుల్‌గాంధీని మళ్లీ అడుగుతున్నా’ అని నిలదీశారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కౌలు రైతులు పాల్గొని తమ డిమాండ్లను వినిపించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 2025 వానకాలం నుంచి కౌలు రైతుల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ అధీకృత సాగుదారుల చట్టం-2011ను అమలుచేసి, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా 2023 సెప్టెంబర్ 13న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ కాపీలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మీడియాకు అందజేశారు. ఆ లేఖలో కౌలు రైతులకు కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని, భూ అధీకృత సాగుదారుల చట్టం-2011ను అమ లు చేసి కౌలు రైతులకు గుర్తింపుకార్డులు మళ్లీ ఇస్తామని, రైతు భరోసాతోబాటు ఇతర పథకా లు, పంట రుణాలను కూడా అందిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌తోపాటు ఆరు గ్యారెంటీల్లోనూ కౌలు రైతులకు కూడా పథకాలు అందిస్తామని స్పష్టంగా పేర్కొన్నదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో కౌలు రైతులు కురువ మంజుల, రమాకాంత్, మాదాసు మాధవి, చాపల సుజాత, ఎడ్ల మానస, ముదస్తు సుమలత, శ్రీనివాస్, రాందాస్, రమేశ్, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు బీ కొండల్, కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, ఎస్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.