వర్ధన్నపేట, నవంబర్ 9: అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్నాతండాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. జగ్నాతండాకు చెందిన బానోత్ మైబూనాయక్(35) తనుకున్న కొద్దిపాటి పొలంతోపాటు నల్లబెల్లికి చెందిన మరో వ్యక్తి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగుకు ఉపయోగకరంగా ఉంటుందని రెండేండ్ల క్రితం లోన్ ద్వారా ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. దీంతోపాటు పంట పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
దీనికితోడు ట్రాక్టర్కు చెల్లించాల్సిన వాయిదాలు కూడా చెల్లించకపోవడంతో రెండు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 7న పొలం దగ్గర నుంచి భార్య రజితకు ఫోన్ చేసి ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగుతున్నానని చెప్పడంతో తండావాసులతో కలిసి హుటాహుటిన పొలం వద్దకు వెళ్లే సరికి అప్పటికే మైబూనాయక్ పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.