వేలేరు, ఆగస్టు 18: పంటలు పండక, అప్పుల తీరక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై సురేశ్ కథనం ప్రకారం.. వేలేరు మండలం శాలపల్లికి చెందిన దామెర అనిల్ కుమార్ (31) గ్రామంలో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటలు సరిగ్గా పండక సుమారు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు.
3 నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఏడాదిపాటు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో అప్పు సుమారు 6.50 లక్షలకు పెరిగింది. వీటిని ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గురయ్యాడు. శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటి వెనుకాల పడి ఉండగా గమనించిన చుట్టుపక్కల వారు 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇవి కూడా చదవండి
‘రాఖీ’కి సాధారణ సెలవునివ్వండి: టీఎస్జీహెచ్ఎం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బాలికలు, ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే రాఖీపండుగను ఐచ్చిక సెలవుగా కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసొసియేషన్ (టీఎస్జీహెచ్ఎం) ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ సెలవుల ఉత్తర్వుల్లో ఐచ్ఛిక సెలవు స్థానంలో సాధారణ సెలవుగా మార్చాలని అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను, ప్రధాన కార్యదర్శులు చంద్రప్రకాశ్, ఆర్ రాజుగంగారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లోని బాలికలు, మహిళా ఉపాధ్యాయులకు సెలవులివ్వాల్సి ఉందని విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఐదురోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటకను ఆనుకొని తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు, నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో 556.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 59శాతం అధికం. గత 24 గంటల్లో అత్యధికంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 5.54 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది.