తిర్యాణి, డిసెంబర్ 8 : అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. సుంగాపూర్కు చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (65) రూ. 2 లక్షలు అప్పు చేసి కూతురు పెండ్లి చేశాడు. అంతకుముందు మరో రూ.2 లక్షలకుపైగా అప్పు చేశాడు. ఎలాగైనా అప్పు తీర్చాలన్న పట్టుదలతో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. వర్షాలకు పంటలు దెబ్బతిని, దిగుబడి రాలేదు.
దీంతో అప్పు ఎలా తీర్చేదని మనస్తాపం చెందిన రాజయ్య సోమవారం ఇంట్లోనే పురుగులమందు తాగాడు. గమనించిన కూతురు సంగీత కుటుంబసభ్యులకు తెలుపగా వెంటనే వారు తిర్యాణి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య దుర్గం కౌసల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.