ఇల్లందకుంట, ఏప్రిల్ 2: అప్పు చేసి పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సిరిసేడు గ్రామానికి వంగ మధు (28) ఈ సీజన్లో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేసి సీడ్ మక్క సాగు చేశాడు.
దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. గ్రామ శివారులోని గుట్టల వద్ద గత నెల 30న పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు మధును వెంటనే వరంగల్ ఎంజీఎం కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.