బేల, అక్టోబర్ 19 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొబ్బాయికి చెందిన కౌలు రైతు బొగజివర్ విశ్వాస్ (56) అప్పుల బాధతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం ఇంటికి వచ్చాడు.
ఆదివారం తాను కౌలుకు తీసుకొని 15 ఎకరాల్లో సాగు చేస్తున్న సోయా చేను వద్దకు వెళ్లాడు. అధిక వర్షాల వద్ద పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి ఉందని గమనించాడు. పెట్టుబడి కోసం ప్రైవేటుగా తీసుకొచ్చిన రూ.3.50 లక్షలు ఎలా తీర్చాలని మదనపడ్డాడు. ఇంటికి వచ్చి పురుగుల మందుతాగాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు 108 అంబులెన్స్‌లో రిమ్స్ దవాఖానకు తరలిస్తుండగా.. మృతిచెందాడు.