తిమ్మాపూర్, సెప్టెంబర్ 9: దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక.. ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకున్నది. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌కు చెందిన గోపగోని బాబు(43) భార్య పద్మతో కలిసి ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. గతంలో బాబు.. అరుణ ఫైనాన్స్ సంస్థలో రూ.2.80 లక్షల రుణం తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. మొదట్లో కిస్తీలు సక్రమంగా చెల్లించాడు.
తర్వాత ఆర్థిక ఇబ్బందులతో రెండు కిస్తీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి కుమార్ వచ్చి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. మరోసారి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇటీవల తన ఇంటిపై జేఎం ఫైనాన్స్ సం స్థలో రూ.7.70 లక్షల రుణం పొం దాడు. బయట కూడా అప్పులు ఉండటంతో రెండు ఫైనాన్స్ల్లోనూ కిస్తీలు చెల్లించలేదు. దీంతో జేఎమ్ ఫైనాన్స్ సిబ్బంది సందీప్‌రెడ్డి, అరుణ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి కుమార్ వేధించసాగారు. దీంతో మనస్తాపానికి గురైన బాబు ఈ నెల 6న ఉదయం పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.