KCR | ప్రతి కథకూ ఓ కొసమెరుపు ఉంటుంది. ముగింపు వాక్యమై గుండెను తడుతుంది ప్రతి నాటకానికీ ఓ ైక్లెమాక్స్ ఉంటుంది చివరి కుదుపుతో డ్రామాను రక్తికట్టిస్తుంది!
రేవంత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గ్లోబల్ సమ్మిట్’లో అలాంటి కొసమెరుపే కనిపించింది. ఫ్యూచర్ సిటీ అనబడే ఊహాజనిత నగరంలో అట్టహాసంగా చేపట్టిన రెండురోజుల సమ్మిట్ వెలవెలబోతూ సాగినా.. ఆఖరిరోజున అనూహ్య ముగింపు మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. నైట్షోలో డ్రోన్లు మెరిసినట్టు కేసీఆర్ పేరు తళుక్కున మెరిసింది. ఆయన సృజించిన తెలంగాణ మాడల్‌ను, పదేండ్ల ప్రగతిని గ్లోబల్ లీడర్స్ వేనోళ్ల పొగుడుతుంటే.. డ్రోన్లచాటు చీకటిలా ముఖ్యమంత్రి ముఖం వాడిపోయింది!
చరిత్ర చింపేస్తే చిరిగిపోదు!! కొన్ని గుర్తులు చెరిపేస్తే చెరిగిపోవు! వందల కోట్లు ఖర్చుచేసి, సొంత ప్రచారం చేసుకుందామనుకుంటే.. సీన్ రివర్స్ అయ్యింది. వచ్చిన ప్రముఖులు అదే వేదికపై, సీఎం ముందే.. తెలంగాణ పదేండ్ల జైత్రయాత్రను ప్రశంసించారు. రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ మాడల్‌కు కితాబిచ్చారు. వాళ్లేమీ ఆశామాషీ ఆహ్వానితులు కారు. ఒకరు ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. మరొకరు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్.
కేసీఆర్ చేసిన ప్రగతిని చూడ నిరాకరించే రాజకీయ కబోదులకు వారి మాటలు ఓ కనువిప్పు! ఆనవాళ్లు చెరిపేస్తామని అహంకారంతో విర్రవీగేవాళ్లకు ఆ ప్రశంసలే ఓ అభిశంసన! కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ! వాస్తవాన్ని విస్మరిస్తే.. చరిత్ర క్షమించదుగాక క్షమించదు!
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆయన ఏర్పాటుచేసిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వేదికపై పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలన అదిరిందహో అంటూ పొగిడేశారు. పదేండ్ల అభివృద్ధిని ప్రశంసించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఏకంగా అభివృద్ధిలో ‘తెలంగాణ ఒక మాడల్’ అంటూ పొగడ్తలు కురిపించారు. గ్లోబల్ సమ్మిట్‌లో మంగళవారం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. కేవలం పదేండ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందని కొనియాడారు. దశాబ్దకాలంలోనే జీఎస్డీపీ మూడింతలు పెరిగిందని మెచ్చుకున్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకిందని ప్రశంసించారు. తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి జరిగిందని, మొత్తంగా తెలంగాణ ఒక మాడల్‌గా ఎదిగిందని ప్రశంసలు కురిపించారు.
పదేండ్లలో అద్భుతమైన ప్రగతి: దువ్వూరి
గత పదేండ్లలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేదని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆర్థిక రంగంలో అగ్రభాగాన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. తాను దేశ, విదేశాల్లోని అనేక నగరాల్లో పర్యటించానని, కానీ హైదరాబాద్‌ను చూస్తే గర్వంగా ఉన్నదని చెప్పారు. ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాద్‌ను చూస్తే తనకు సంబురంగా అనిపిస్తున్నదని కితాబిచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందినవారు ఇక్కడ నివసిస్తున్నారని, అందరికీ ఉపాధి దొరుకుతున్నదని వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ప్రతిబింబించే ఏకైక నగరం హైదరాబాద్ అని కొనియాడారు.
తన కోసం సమ్మిట్ పెడితే..
ఎలాంటి కనీస సౌకర్యాలు లేని ఫోర్త్‌సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడంపై మొదటినుంచీ అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. హైటెక్స్, హెచ్ఐసీసీ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలను కాదని, కనీసం రోడ్డు కూడా సరిగా లేని చోట ఎందుకు నిర్వహిస్తున్నారన్న ప్రశ్న అందరిలో మొదలైంది. వాస్తవానికి ఈ గ్లోబల్ సమ్మిట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘సీఎం రేవంత్‌రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే గ్లోబల్ సమ్మిట్‌ను తెరమీదికి తెచ్చారు. కానీ, కథ అడ్డం తిరిగింది. సమ్మిట్‌కు వచ్చిన ప్రతినిధులు కేసీఆర్‌ను పొగిడారు?’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ‘బాహుబలి సినిమాలో రాణా (భల్లాలదేవుడు) ఒక ఎత్తయిన బంగారు విగ్రహం చేయించి ప్రతిష్ఠిస్తాడు. ఇక తనకు ఎదురులేదని అనుకుంటాడు. కానీ ప్రజల మనసుల్లో బాహుబలిపై ఉన్న ప్రేమను చూసి తన విగ్రహం కన్నా ఎత్తుగా ఉన్నట్టు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు తెలంగాణలో అచ్చం ఇలాంటి సీనే నడుస్తున్నది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తనను తాను ప్రొజెక్ట్ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తే, టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు కేసీఆర్‌ను పొగిడారు. ఇది పదేండ్ల పాలనకు నిదర్శనం’ అని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు.
కేసీఆర్ విజన్.. తెలంగాణ మాడల్
గ్లోబల్ సమ్మిట్‌లో టోనీ బ్లెయిర్గానీ, దువ్వూరి సుబ్బారావుగానీ తెలంగాణపై కురిపించిన ప్రశంసలన్నీ కేసీఆర్ ప్రభుత్వానికేనని స్పష్టమవుతున్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు అన్ని రంగాలు నేలచూపులు చూస్తుండగా, అభివృద్ధి రేటు నామమాత్రంగా ఉన్నదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అలాంటి సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ పథకాల ఫలితంగా అతి తక్కువ కాలలోనే తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగింది. బూడిద నుంచి ఆకాశానికి ఎగిరిన ఫీనిక్స్ పక్షి మాదిరిగా కేసీఆర్ విజన్‌తో తెలంగాణ సాధించిన వేగవంతమైన, సమ్మిళిత వృద్ధిని చూసి అభివృద్ధికి తెలంగాణను ఒక మాడల్‌గా గుర్తించారు. అప్పటివరకు అభివృద్ధికి గుజరాత్ మాడల్ మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఇది కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ వేదిక మీద ప్రముఖులు గుర్తు చేశారు.

ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనుకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ, పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ, విదేశాల్లోని అనేక నగరాల్లో నేను పర్యటించాను. కానీ, హైదరాబాద్ గొప్పగా వెలిగిపోతున్నది. ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాద్‌ను చూస్తే గర్వంగా ఉన్నది.
– ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. కేవలం పదేండ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. దశాబ్దకాలంలోనే జీఎస్డీపీ మూడింతలు పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు టెక్నాలజీ, వ్యవసాయం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నతస్థాయిలో నిలిచింది. సమ్మిళిత వృద్ధికి తెలంగాణ ఒక మాడల్‌గా ఎదిగింది.
– బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్
సమ్మిట్!.. కథ అడ్డం తిరిగింది!!