హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించనున్నది. 2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించనున్నది.
ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్‌కు కోర్టులు సూచనలు చేయడం, చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి విధించే అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున న్యాయవాదుల వాదనలను విన్నది. మూడు రోజులపాటు వరుసగా దీనిపై వాదనలు నడిచాయి. తుది తీర్పును రిజర్వు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న ప్రకటించింది. దేశంలోని రెండు రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశంగా ఇది ఉన్నందున ఆనాడు జస్టిస్ గవాయ్ బెంచ్ చాలా సుదీర్ఘ వాదనలను విన్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.
సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. స్పీకర్ల చేతిలో రాజ్యాంగం ఖూనీ అవుతున్నదన్న వాదన బలంగా ఉన్నది. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే బాధిత పక్షం ముందున్న మార్గాలేమిటన్న చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొలుత శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు.
స్పీకర్ ఫిర్యాదు తీసుకొనేందుకు కొంత ఆలస్యం చేయడమే కాకుండా, బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై ఆరు నెలలైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కనీసం వివరణ కూడా అడగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్పీకర్ వద్ద నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాకపోవడం, ఫిరాయింపుదారుల నుంచి కనీసం వివరణ తీసుకోకపోవడం, విచారణ ప్రారంభించకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది.
హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత స్పీకర్ కార్యాలయం స్పందించినప్పటికీ, చర్యలు తీసుకోవడానికి నిర్ణీత గడవును మాత్రం చెప్పలేదు. దీంతో బీఆర్ఎస్ తగిన న్యాయం చేయాలని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని స్పీకర్‌కు తగిన డైరెక్షన్లు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు అనుసరించిన విధానాలను కూడా బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫాంపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కండ్ల ముందు కనిపిస్తుంటే స్పీకర్ ఇంకా విచారణ కూడా ప్రారంభించకపోవడంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ విజ్ఙప్తి చేసింది.
గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వెలువరించే తీర్పు దేశంలో ఇప్పటివరకు వచ్చిన తీర్పుల్లోనే అత్యంత కీలకమైనదిగా మారనున్నది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణంగా మారుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో శివసేన చీలిక సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాదిరిగానే ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు కూడా చారిత్రాత్మకం కానున్నది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి ఉండాలన్న దానిపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.
తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం కేసుపై తీర్పు ఇస్తారా? లేక స్పీకర్, న్యాయస్థానాల పరిధిలకు సంబంధించి స్పష్టత ఇస్తారా? అన్నది గురువారం తేలిపోతుంది. ఏప్రిల్ మూడో తేదీ వరకు జరిగిన వాదనల్లో స్పీకర్ నిర్ణయాధికారాలపై న్యాయస్థానాల జోక్యం ఎలా ఉండాలన్నదానిపైనే చర్చ జరిగింది. గురువారం సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పులో స్పీకర్‌కు సలహాలు ఇచ్చే అంశంతోపాటు తగిన ఆధారాలున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు చెప్తున్నారు.