హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : దేవాలయాల్లో పనిభారం పెరగడం, అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల నియామకాలకు దేవాదాయ శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఆ శాఖ ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఏడీసీలు కృష్ణవేణి, శ్రీనివాసరావు, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. గురువారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయం ధార్మికభవన్లో అర్చక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. అర్చక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గంగు ఉపేంద్రశర్మ, కాండూరి కృష్ణమాచార్య, డీవీఆర్ శర్మ, మారుతి సత్యనారాయణశర్మ, చంద్రశేఖరశర్మ, పరాశరం రవీంద్రాచారి, తనుగుల అనిల్‌కుమార్ తదితరులు సమావేశానికి హాజరై కమిటీకి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
దేవాలయాల్లో అర్చకులను, పరిచారకులను నియమించే క్రమంలో వారికి రూ.20వేల వేతనం ఇవ్వాలని, భవిష్యత్‌లో శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలో వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని సంఘాల ప్రతినిధులు సూచించారు. తాత్కాలిక నియామకాలు చేపట్టినా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దేవాదాయ శాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని, అర్చక సంఘాల అభిప్రాయాలను కూడా జోడించి సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జూన్ 26 వరకు వనమహోత్సవాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పెద్ద ఎత్తన పండ్లు, పూల మొక్కలను నాటాలని సూచించారు.
హైదరాబాద్, మే29 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ (2024-25) దరఖాస్తులకు జూన్ 30 వరకు గడువును పొడిగిస్తున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు తెలపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.