హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కాంట్రాక్టర్ల అభ్యంతరాలు, నిధుల సమీకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఆగస్టులో టెండర్లను పిలుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి పలుమార్లు ప్రకటించినా ఇంతవరకు పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే టెండర్లు పిలువాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లను దశలవారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిదశలో రూ.6,478.33 కోట్లతో 5,190. 25 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జూలైలో ఆమోదం తెలిపింది.
350 కి.మీ. మేర రోడ్ల విస్తరణ పనులతోపాటు మరమ్మతులు, నిర్వహణ, కొత్త రోడ్ల నిర్మాణ పనులు ఉన్నాయి. 16 ఆర్అండ్బీ సర్కిళ్లలో 373 ప్యాకేజీలుగా పనులను విభజించి జిల్లాల వారీగా టెండర్లను పిలిచేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధంచేశారు. అన్నీ సవ్యంగా సాగితే ఆగస్టు రెండోవారంలో టెండర్లను పిలువాల్సి ఉండె. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాల్సిన ఈ ప్రాజక్టుపై కాంట్రాక్టర్లు విముఖత చూపు తున్నారు. పెండింగ్ బిల్లులే చెల్లించని సర్కారు హ్యామ్ రోడ్ల ప్రాజెక్టులో పనులు చేస్తే ఎలా బిల్లులు చెల్లిస్తుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలువడానికి ముందు కాంట్రాక్టర్లు, బ్యాంకర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నెలలో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఇవే..
కాంట్రాక్టర్లు హ్యామ్ విధానంలో పలు మార్పులు సూచించడంతోపాటు తాము వెచ్చించే నిధులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టంచేశారు. రోడ్ల మరమ్మతులు, ఏడాది నిర్వహణ పనులను హ్యామ్ నుంచి మినహాయించాలని, కొత్త రోడ్లు, రోడ్ల విస్తరణ పనులను మాత్రమే ఉంచాలని వారు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 120 బీటీ మిక్సింగ్ ప్లాంట్లు పనిచేస్తుండగా, వీటి ద్వారా రోడ్ల మరమ్మతు పనులు, రోడ్ల నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని కాంట్రాక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఒకవేళ హ్యామ్ విధానంలో రోడ్ల నిర్వహణ పనులను కూడా చేర్చితే ఈ బీటీ ప్లాంట్లకు పనిలేకుండా పోతుందని, తద్వారా వాటిలో పనిచేసే 20 వేల మంది కార్మికులు, ఇంజినీర్లు రోడ్డున పడతారని చెప్పారు. ప్రభుత్వం క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని, రానున్న సర్కారు ఒకవేళ కక్షసాధింపు ధోరణి అవలంబించినా తమకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భరోసా కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ల సూచనలతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది.
హ్యామ్ రోడ్ల ప్రాజెక్టు వివరాలు ఇవే
హ్యామ్ రోడ్ల ప్రాజక్టులో 40% నిధులు ప్రభుత్వం, మిగతా 60% నిధులను కాంట్రాక్టర్లు భరించాల్సి ఉంటుంది. పనులు చేపట్టిన మొదటి రెండున్నరేండ్లలో ప్రభుత్వం తమ వాటా 40% నిధులను చెల్లిస్తుంది. మిగతా 60 శాతంలో కాంట్రాక్టర్లు 18% సొంతంగా, 42% బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకోవాలి. కాంట్రాక్టర్లు వెచ్ఛించిన 60% నిధులను పనులు పూర్తయ్యాక ప్రభుత్వం 0.8% వడ్డీతో నెలనెలా 30 వాయిదాల్లో చెల్లిస్తుంది. పనులు పూర్తయ్యాక 15 ఏండ్లపాటు కాంట్రాక్టరే ఆ రోడ్డును నిర్వహించాలి. దీనికి అయ్యే ఖర్చును మాత్రం ప్రభుత్వం భరిస్తుంది.
సర్కార్ నుంచి దక్కని భరోసా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాము ఖర్చుచేసే 60% నిధులను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుందనే భరోసా కాంట్రాక్టర్లకు కలగడం లేదు. వాస్తవానికి హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు వెచ్చించే 60% నిధులను టోల్‌ట్యాక్స్ ద్వారా వసూలు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం అలా చేయకుండా ఆ నిధులనూ తామే చెల్లిస్తామని ప్రకటించింది. తాము వెచ్చించే నిధులకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గ్యారెంటీ లభిస్తేనే ముందుకు సాగుతామని కాంట్రాక్టర్లు మంత్రి సమక్షంలోనే స్పష్టంచేశారు. దీంతో నిధుల సమీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత, ఆ మేరకు కాంట్రాక్టర్లను ఒప్పించి ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, ముందు నిర్ణయించిన విధంగా కాకుండా, కొత్త రోడ్లు, రోడ్ల విస్తరణ మాత్రమే హ్యామ్‌లో చేపట్టాలని భావిస్తున్నారు.
హ్యామ్ రోడ్ల మొదటి దశ