Telangana | గీసుగొండ, డిసెంబర్ 11: రాజన్న కోడెలను కబేళాలకు విక్రయించడంపై ఆలయ అధికారులు బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ, అనంతారం, చలపర్తి గ్రామాల్లో విచారణ జరిపారు. ఆలయ సూపరింటెండెంట్ వైరి నర్సయ్య, క్లర్క్ రవి ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల పేర్లతో తెచ్చిన కోడెలు వారికి ఇచ్చారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. తనకు ఆవు ఇస్తానని నెల కిత్రం ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం మందస్వామి తీసుకెళ్లాడని, కానీ ఇవ్వలేదని సాయింపు వెంకటేశ్వర్లు తెలిపారు. మనుగొండలో కూడా ఎవరికీ ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. ఈ నివేదికను ఆలయ ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
రాంబాబు, స్వామి, శ్యామ్‌సుందర్ తెచ్చిన కోడెల్లో మూడు చనిపోయినట్టు విచారణలో తేలడంతో ఎస్సై కుమార్ ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యాధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ వైరి నర్సయ్య సమక్షంలో కోడెను పాతిపెట్టిన స్థలం నుంచి తవ్వి బయటకు తీశారు. శాంపిల్స్‌ను సేకరించి వైద్యాధికారి పరీక్షల నిమిత్తం హనుమకొండ ల్యాబ్‌కు పంపారు.
ఈ కోడెలకు ట్యాగ్ లేదని వైద్యాధికారి తెలిపారు. మరో రెండు కోడెలు శ్యామ్‌సుందర్ వద్ద చనిపోగా, వాటిని లక్నేపల్లి శివారులో పడేసినట్టు గుర్తించారు. వాటికి దుగ్గొండి వైద్యాధికారి వింధ్య పరీక్షలు నిర్వహించి, వాటి ట్యాగులను ఆలయ అధికారులకు అప్పగించారు. మిగిలిన 9 కోడెలను గీసుకొండ పోలీసులు స్వాధీనం చేసుకొని పాలకుర్తి లోని గోశాలకు తరలించినట్టు సీఐ మహేం దర్ తెలిపారు. విచారణ ముగిసే వరకు గోశాలలోనే ఉంచుతామని పేర్కొన్నారు.