కొత్తగూడ/మరిపెడ, ఆగస్టు 18: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో విసుగుచెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రూ.20 వేలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని భిక్షామాచారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.70 వేల నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం లభ్యమైనట్టు ఏసీబీ సీఐ ఎస్ రాజు తెలిపారు.