హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఐదు లక్షలకు లోబడి ఆదాయమున్న ఆలయాల నిర్వహణను దేవాదాయ, ధర్మాదాయ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలనే వ్యవహారంపై ప్రభుత్వ వాదన తెలపాలని హైకోర్టు కోరింది. ఆ ఆలయాలను అనువంశిక ధర్మకర్తలు, ఆలయ వ్యవస్థాపకులు, వీరు లేనిపక్షంలో ప్రభుత్వం అనుమతించిన వారికి అప్పగించాలంటూ హైదరాబాద్కు చెందిన ఎన్ శ్రీనివాస్ సహా ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల జస్టిస్ సీహెచ్ సుమలత విచారించారు.
రాష్ట్రంలో 10 వేలకుపైగా రిజిస్టర్డ్ ఆలయాలు ఉన్నాయని, ఒక్కో ఆలయం రూ.37 వేల నుంచి రూ.92,500 వరకు ప్రభుత్వానికి సీజీఎఫ్, ఇతర చెల్లింపులు చేస్తున్నాయని వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు ప్రతివాదులైన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.