యాదగిరిగుట్ట, నవంబర్ 20: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఖాజానాకు కార్తీక మాసం నిత్యరాబడిని ఆలయ అధికారులు విడుదల చేశారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా 30 రోజులు యాదగిరీశుడి సన్నిధిలో జరిగిన కార్తీకమాస ఉత్సవాలలో రూ. 17,62,33,331 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు ప్రకటించారు. గతేడాది(2024) 29 రోజులకు గానూ రూ. 14,30,69,481 సమకూరగా ఈ సారి 30 రోజులకు గానూ రూ. 3,31,63,850 కోట్ల వరకు ఆదాయం పెరిగిందని తెలిపారు.
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో అన్నవరం అనంతరం అత్యధికంగా జరిగే సత్యనారాయణస్వామి వ్రతాల ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది 23,263 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొనగా రూ. 1,86,10,400 సమకూరగా ఈ ఏడాది 24,447 మంది భక్తులు వ్రతాల్లో పాల్గొనగా రూ. 2,56,68,000 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అమావాస్య కావడంతో గోశాల ప్రాంగణంలో గణపతిపూజ, స్వస్తివాచనం, ఆదిత్యాదినవగ్రరాధన, మండపారాధన, సత్యనారాయణస్వామి పూజ, తులసీదాత్రి సమేత శ్రీకార్తీకదామోదరస్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపి తీర్ధప్రసాద వితరణ గావించి కార్తీకమాసం ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలికారు.