హైదరాబాద్, మార్చి 28 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. శుక్రవారం ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదైందని పేర్కొన్నారు. పశ్చిమ జిల్లాల్లో 36 డిగ్రీల నుంచి 40వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్లో సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా నమోదవుతుందని వివరించారు. మార్చి నెలాఖరు నుంచి వడగాల్పులు వీచే అవకాశముందని, ఏప్రిల్లో అధిక వేడిమి ఉంటుందని పేర్కొన్నారు.
నాలుగు రోజుల తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడని, నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 3, యాదాద్రి జిల్లాలో 13 ప్రాంతాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపారు.