Telangana | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వారం నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయి ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. దాదాపు 20 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఈ నెల 10నుంచి 13 తేదీల మధ్య మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉదయం, సాయంత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీ(టీ)లో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నది. నగరంలో 16వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని వివరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం చలిగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొన్నది. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని తెలిపింది.