Southwest Monsoon | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులున్నట్టు వాతావరణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసినప్పటికీ వాతావరణ మార్పులతో, జూన్ 5నుంచి 10 వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నదని తెలిపింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్టు హెచ్చరించింది.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా, సాయంత్రం మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయని వివరించింది. ముఖ్యంగా నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్టు తెలిపింది. కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వాన కురువగా, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్‌లో భారీ వర్షం కురిసినట్టు పేర్కొన్నది.
రాష్ట్రంలో మరో నాలుగురోజులపాటు తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. 20 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.5 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 46.4, సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 46.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3, ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
వడదెబ్బకు ఆదివారం ఒక్కరోజే 42మంది మృతి!
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే దాదాపు 42మంది మృతి చెందారు. ఒక్క వరంగల్‌లోనే అత్యధికంగా 20మంది మృతి చెందగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10మంది, కరీంనగర్లో 8 మంది, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు.