హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గి, క్రమంగా చలి ప్రభావం పెరుగుతున్నది. నైరుతి రుతుపవనాలు తిరోగమనంతో వాతావరణం మారుతున్నట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు చల్ల గాలులు వీస్తున్నాయి. దీంతోనే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు తెలుస్తున్నది. మరోపక్క పగటి పూట మాత్రం ఎండ తీవ్రత ఉంటుంది.
ఉత్తర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతున్నది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ తక్కువ నమోదవుతున్నాయి. బుధవారం ఖమ్మం జిల్లాలో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉండగా, మెదక్లో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని, రెండు రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.