హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పాఠశాలల్లో 9,10 తరగతుల్లో 2026-27 విద్యాసంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
తెలుగు తప్పనిసరి అమలు చట్టం-2018 ప్రకారం అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పకుండా బోధించాలని ఆదేశించారు. 2018 నుంచి ఒక్కో తరగతికి తెలుగును క్రమంగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025-26 విద్యాసంవత్సరంలో 9వ తరగతికి విస్తరించారు. ప్రస్తుతం 2026-27లో 10వ తరగతిలో తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చారు.