సోమవారం 25 మే 2020
Telangana - Apr 06, 2020 , 01:57:28

ఆస్ట్రే లియాలో విద్యార్థులకు కష్టాలు

ఆస్ట్రే లియాలో విద్యార్థులకు కష్టాలు

  • అద్దె, నిత్యావసరాలకు చాలని డబ్బులు
  • పార్ట్‌టైం ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు
  • కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పర్యవసానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌.. విదేశాల్లో చదువుకుం టున్న విద్యార్థులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లినవారికి కష్టా లు మొదలయ్యాయి. ఇప్పటివరకు వారిని ఆదుకొంటూ వస్తున్న పార్ట్‌టైం ఉద్యోగాలు పోవడంతో నానా అవస్థలు పడుతున్నా రు. ఇంటి అద్దె, నిత్యావసరాలకు డబ్బులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆఖరుకు సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ రీచార్జి వంటివి కూడా పెనుభారంగా మారాయి. అధికారిక లెక్కల ప్రకారం 2019లో ఆస్ట్రేలియాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు దాదాపు 5.45 లక్షల మంది ఉన్నారు. ఇందులో 75 వేల మంది మనదేశం నుంచి వెళ్లారు. ఇరవై వేల మంది వరకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. వీళ్లలో 70 శాతం మంది పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూనే చదువుకొంటుంటారు. 

ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం వారానికి ఇరవై గంటలపాటు పార్ట్‌టైం ఉద్యోగాలు చేయవచ్చు. ఇలా పనిచేసేవారు వారానికి కనీసంగా 250 నుంచి 400 డాలర్ల వరకు సంపాదిస్తుంటారు. సిడ్నీ, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌ లాంటి ప్రధాన నగరాల్లో ఇంటి అద్దె (ట్రిపుల్‌ బెడ్‌రూం) 400 నుంచి 500 డాలర్ల వరకు ఉంటుంది. శివారు గ్రామాలు, నగరాలకు కాస్త దూరంగా ఉండే ఇండ్లకు అద్దె వంద డాలర్ల వరకు ఉంటుంది. అందులోనూ ముగ్గురు మాత్రమే ఉండాలి. అద్దెను తగ్గించుకోవడానికి ఇద్దరు ముగ్గురు కలిసి గదులను షేర్‌ చేసుకొంటుంటారు. తాము సంపాదించుకొన్న మొత్తంతో నిత్యావసరాలు, సెల్‌, నెట్‌, రవాణా ఖర్చులను వెళ్లదీస్తుంటారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల అన్నీ నిలిచిపోవడంతో వీరందరూ ఉపాధి కోల్పోయారు. జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ముఖ్యంగా యువతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అవసరమైతే వెళ్లిపోతాం

సూపర్‌మార్కెట్లకు వెళ్తే సరుకులు లేక ఖాళీగా ఉన్నాయని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. పరిస్థితులు చక్కబడేవరకు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడమే ఉత్తమమనే అభిప్రాయమూ వారిలో వ్యక్తమవుతున్నది. కొందరు విద్యార్థులు అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులను కలిసి విజ్ఞప్తిచేస్తున్నారు. స్థానిక యాక్టింగ్‌ ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలన్‌ టుడ్జ్‌ సానుకూలంగా స్పందించారని కూడా చెప్తున్నారు. విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకొంటే.. ఆయా దేశాలతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా పంపించే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు స్థానిక సంస్థలు, దాతలు, సంఘాల ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. 

అమ్మాయికి కష్టాలు

కొద్దిరోజుల క్రితం ఉత్తర తెలంగాణ నుంచి ఒక యువతి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్లింది. చదువుకొంటూనే.. అక్కడ తెలిసినవారి సహాయంతో సమీపంలో ఉన్న బర్గర్‌ సెంటర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం సంపాదించుకొన్నది. ఇలా కష్టపడుతూ.. వారానికి 350 డాలర్ల వరకు సంపాదించేది. ఆ డబ్బుతో ఇంటిఅద్దె, నిత్యావసరాలు, నెట్‌, సెల్‌ బిల్లు భారం తప్పేది. ఇప్పుడు కరోనా కారణంగా.. బర్గర్‌ సెంటర్‌ మూతపడింది. ఉన్న తాత్కాలిక ఉపాధికూడా పోయింది. బ్రిస్బేన్‌కు సుమారు 170 కి.మీ దూరంలో నివసిస్తున్న ఆ యువతి ఇంటి అద్దెకు, నిత్యావసరాలకు కష్టాలు తప్పట్లేదు. 

సాయంచేస్తున్నాం


నిత్యావసరాలు కావాలంటే, నన్ను సంప్రదించాలని కోరా. గత శుక్రవారం 70 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. విద్యార్థులు ఇంటి అద్దెకోసం ఆర్థిక సహాయంచేయాలని కోరారు. స్థానిక సంస్థలు, సంఘాలు, దాతలకు సమాచారం చేరవేస్తున్నాం. బ్రిస్బేన్‌ చుట్టుపక్కల 150 కిలోమీటర్ల మేర వెళ్లి విద్యార్థులకు నిత్యావసరాలను అందిస్తున్నాం. అవసరమై తే స్వదేశాలకు వెళ్లి ఆన్‌లైన్‌లో చదువుకొనే అవకాశం కల్పిస్తున్నాయి.

- శ్రీకర్‌రెడ్డి అండెం, తెలంగాణ జాగృతి ,ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు


logo