కేశంపేట, మార్చి 9: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన గంప ప్రవీణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
అమెరికా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారుజామున వచ్చిన గంప ప్రవీణ్ పార్థివదేహాన్ని భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శంషాబాద్ నుంచి నేరుగా కేశంపేట మండల కేంద్రానికి తరలించి ప్రవీణ్ నివాసంలో కుటుంబ సభ్యుల సందర్శనార్థం కొద్దిసేపు ఏర్పాటు చేశారు. కేశంపేట మాజీ సర్పంచ్ తలసాని వెంకట్‌రెడ్డి, పాలమూరు చారిట్రబుల్ ట్రస్ట్ అధినేత విష్ణువర్ధన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు ప్రవీణ్‌కు నివాళులర్పించారు. అంతిమయాత్ర దారి పొడవున పూలవర్షం కురిపించడంతోపాటు ప్రవీణ్‌ను కడసారి చూసేందుకు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కేశంపేటలో గంప ప్రవీణ్ అంతిమయాత్ర
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27), కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్ హోటల్లో పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ నెల 5వ తేదీన ప్రవీణ్ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్ అక్కడికక్కడే మరణించారు.