TS Minister Harish Rao | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్నుశాఖలతో బెదిరిస్తోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే సిసోడియా అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కక్ష సాధింపు చర్యగానే మనీశ్ సిసోడియా అరెస్ట్ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థకు బీజేపీ కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నదని మండి పడ్డారు.
లిక్కర్‌స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటలు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడం ద్వారా కేంద్రం మురికి రాజకీయాలు చేస్తున్నదని మండి పడ్డారు. మనీశ్ సిసోడియా అమాయకుడని అన్నారు.