కొందరికే యువవికాసం
రాష్ట్ర యువతను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసేందుకు సిద్ధమైంది. అర్హులందరికీ రాజీవ్ యువవికాసం రుణాలు ఇస్తామంటూ ఊరించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం కొద్దిమందికే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అదికూడా లక్ష యూనిట్లకే పరిమితం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏడాదిన్నరగా రుణాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు మరోసారి భంగపాటు తప్పదని అధికారవర్గాలే చర్చించుకుంటున్నాయి.
- యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
- లక్ష యూనిట్ల వరకే రుణసాయం
- కేవలం లక్ష మందికే ఇచ్చే చాన్స్
- కసరత్తు మొదలు పెట్టిన ప్రభుత్వం
- నవంబర్‌లో అమలుకు సన్నాహాలు
- దరఖాస్తుల్లో 75% 4 లక్షల యూనిట్లవే
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర యువతను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసేందుకు సిద్ధమైంది. అర్హులందరికీ రాజీవ్ యువవికాసం రుణాలు ఇస్తామంటూ ఊరించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం కొద్దిమందికే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అదికూడా లక్ష యూనిట్లకే పరిమితం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏడాదిన్నరగా రుణాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు మరోసారి భంగపాటు తప్పదని అధికారవర్గాలే చర్చించుకుంటున్నాయి.
రాజీవ్ యువవికాసం పథకం (ఆర్‌వైవీ) కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా అట్టహాసంగా ప్రకటించింది. ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆనాడే వెల్లడించింది. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది యువతకు 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రుణాలను మంజూరు చేస్తామని ఊదరగొట్టింది. పత్రికా ప్రకటనలను గుప్పించింది. కానీ, ఆచరణలో ఇప్పటికీ పైసా విదల్చకుండా జాప్యం చేస్తూ వచ్చింది.
ఇప్పుడు కొద్దిమందికే ఇచ్చేందుకు సిద్ధమైన యువతను ఉసూరుమనిపించింది. ఈ ఆర్‌వైవీ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల యూనిట్లకు 10 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ రుణాల కోసం 2025 ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు ఎస్సీలు 3,64,691 మంది, ఎస్టీలు 1,74,365, బీసీలు 7,28,229, ఈబీసీలు 31,998, మైనారిటీలు 1,82,186, క్రిస్టియన్ మైనారిటీలు 3,712 మంది చొప్పున దరఖాస్తులు చేసుకున్నారు.
లక్ష లోపు యూనిట్లకే రుణాలు!
అర్హులందరికీ రుణాలిస్తామని ఊదరగొట్టిన సర్కార్ ఇప్పుడు చేతులేత్తెసింది. కేవలం రూ.50 వేల నుంచి రూ.లక్ష లోపువరకు ఉన్న యూనిట్లకే రుణాలు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఆపై యూనిట్లకు రుణాల మంజూరుపై చేతులెత్తేసిందని సమాచారం. అధికారవర్గాలు ఇదే విషయంపై చర్చించుకుంటున్నాయి. ఈ పథకం కోసం వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 75 శాతానికి పైగా అర్జీలు కేవలం 4 లక్షల యూనిట్ల కోసం పెట్టుకున్నట్టు అధికారిక గణాంకాలే వివరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ మేరకు యువతకు నిరాశ ఎదురుకానున్నదని తెలుస్తున్నది. అంటే ప్రతి 10 మందిలో కేవలం ముగ్గురికే రుణాలను ఇవ్వాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించిందని తెలుస్తున్నది. అదీగాక 2, 3, 4 లక్షల యూనిట్లను ఎత్తివేయాలని భావిస్తున్నారు. ఆ దరఖాస్తులను రూ.50 వేల నుంచి 1లక్ష యూనిట్లకు మార్పు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టుగా తెలుస్తున్నది. దీంతో ఎక్కువ మందికి ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నది. ఎంపీడీవోలు ఇప్పటికే యూనిట్ల మార్పు ప్రక్రియను చేపట్టిన ట్టు సమాచా రం. వచ్చే నెల లో ఆ మేరకు రుణాలను ఇచ్చే ందుకు సన్నాహాలు చేస్తున్నదని అధికారవర్గాలు తెలుపుతున్నాయి.
5 యూనిట్లుగా సబ్సిడీ సాయం
ఆర్‌వైవీ పథకంలో లబ్ధిదారులకు అందించే సబ్సిడీ రుణ మొత్తాన్ని 5 రకాల యూనిట్లుగా విభజించింది. కేవలం రూ.50 వేల యూనిట్ మాత్రమే 100శాతం సబ్సిడీతో అందిస్తున్నది. రూ.లక్ష యూనిట్లో 90 వేలు ప్రభుత్వం, 10 వేలు బ్యాంకు రుణంగా, రూ.2 లక్షల యూనిట్లో 1.60 లక్షలు ప్రభుత్వం, 40 వేలు బ్యాంకు రుణంగా, రూ.3 లక్షల యూనిట్లో 2.10 లక్షలు ప్రభుత్వం, 90 వేలు బ్యాంకు రుణంగా, రూ.4 లక్షల యూనిట్లో 2.80 లక్షలు ప్రభుత్వం, 1.20 లక్షలు బ్యాంకు రుణంగా అందివ్వాలని నిర్ణయించింది.
5 ఫేజుల్లో రుణాల మంజూరు
ఎంపిక చేసిన లబ్ధిదారులకు 5 ఫేజుల్లో రుణాలను మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. 2025 జూన్‌లో 85,000 మందికి రూ.50 వేలు, లక్ష యూనిట్లను, జూలైలో లక్ష మందికి రూ.1లక్ష, 2 లక్షల యూనిట్లను, ఆగస్టులో మరో లక్ష మందికి రూ.2 లక్షలు, 3లక్షల యూనిట్లను, సెప్టెంబర్‌లో ఇంకో లక్ష మందికి రూ.2లక్షలు, 4లక్షల యూనిట్లను, అక్టోబర్‌లో 1,08,234 మందికి రూ.3లక్షలు, 4లక్షల యూనిట్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 4,93,234 మందికి రూ.6,250.50 కోట్లను సబ్సిడీ రుణాలుగా విడుదల చేస్తామని పత్రికా ప్రకటన సైతం జారీచేసింది. కానీ ఇప్పటివరకు ఆ పథకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

