హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటినందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కీర్తించింది. 54 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా గుర్తించింది. ఈ మేరకు ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ‘జల్‌జీవన్’ పురస్కారాన్ని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డికి అందజేశారు. జాతీయ జల్‌జీవన్ మిషన్ ఆధ్వర్యంలోని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యం, జల్‌శక్తి మంత్రిత్వశాఖ మిషన్ భగీరథ పథకాన్ని సునిశితంగా పరిశీలించింది. పథకం పనితీరు, నిర్వహణపై 320 గ్రామాల్లో జాతీయస్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలు సేకరించి పురస్కారానికి ఎంపిక చేసింది. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విశేష కృషికి 13 అవార్డులు దక్కాయి. ‘స్వచ్ఛభారత్ దివస్’లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆ శాఖ డైరెక్టర్ హనుమంతరావులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు అవార్డులు అందుకున్నారు.
అవార్డులు -వివరాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్..రాష్ట్రాలు, జిల్లా లు, గ్రామ పంచాయతీల్లో వివిధ పోటీలు నిర్వహించి జాతీయ అవార్డులను ప్రకటించింది. తాగునీరు పారిశుద్ధ్యశాఖ, జల్శకి ్తమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 2021-22లో పలు ప్రచార కార్యక్రమాలు, పోటీలను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 725 పంచాయతీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే జరిగింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో జాతీయస్థాయిలో తెలంగాణ 1వ ర్యాంక్, అగ్ర జిల్లాల విభాగంలో జగిత్యాల జిల్లా 2వ ర్యాంక్, ఓవరాల్ జిల్లాల విభాగంలో నిజామాబాద్ 3వ ర్యాంక్, మొత్తం టాప్ జిల్లాల విభాగంలో సౌత్ జోన్లో నిజామాబాద్ 2వ ర్యాంక్, టాప్ జిల్లాల విభాగంలో సౌత్జోన్లో భద్రాద్రి కొత్తగూడెం 3వ ర్యాంక్ సాధించాయి.
గ్రామాల్లో కమ్యూనిటీస్థాయిలో ఇంకుడుగుంతల నిర్మాణానికి 100 రోజుల సుజలాం 1.0 ప్రచార కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టు 23న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణవ్యాప్తంగా 1,31,979 ఇండ్లు, కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నమోదు చేశారు. సుజలాం 1.0లో తెలంగాణ జాతీయస్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.
ప్రపంచ నీటిదినోత్సవం సందర్భంగా సుజ లాం 2.0 ప్రచారంలో భాగంగా మురికినీటి నిర్వహణపై దృష్టి సారించారు. రాష్ట్రంలో 3,31,987 గృహ, కమ్యూనిటీస్థాయి, కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు నిర్మించారు. సుజలాం 2.0లో తెలంగాణ జాతీయస్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది.
బహిరంగ మలమూత్ర విసర్జన వద్దంటూ ప్రజల్లో అవగాహన పెంచడానికి తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీల్లో 43,583 వాల్ పెయింటింగ్స్ వేశారు. ఈ పోటీల్లో రాష్ట్రం సౌత్‌జోన్ విభాగంలో మొత్తం 5 అవార్డులను కైవసం చేసుకున్నది.
వీటితోపాటు బయో డిగ్రేడబుల్ వ్యర్థాల నిర్వహణ విభాగంలో 1వ ర్యాంక్, గోబర్ధని విభాగంలో 1వ ర్యాంక్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ విభాగంలో 1వ ర్యాంక్, మురికినీటి నిర్వహ ణ విభాగంలో 1వ ర్యాంక్, మానవ వ్యర్థాల నిర్వహణ విభాగంలో 1వ ర్యాంక్ దక్కింది.
ఓడీఎఫ్ నుంచి ఓడీఎఫ్ ప్లస్‌కు గ్రామపంచాయతీల విజయాలు తెలిపేందుకు గత ఏడాది డిసెంబర్లో జాతీయ చలనచిత్రాల పోటీలు ప్రారంభించారు. తెలంగాణ నుంచి 313 ఎంట్రీలు నమోదు కాగా, ఖమ్మం జిల్లా ఏనూరు మండలం నూకలంపాడు పంచాయతీ జాతీయస్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది.
తప్పుడు ప్రచారంలో సూపర్ స్పైడర్లు: మంత్రి కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫేక్‌న్యూస్, తప్పుడు ప్రచారం చేయడంలో సూపర్ స్పైడర్లుగా మారడం సిగ్గుచేటని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీటిని అందించే మిషన్ భగీరథకు అవార్డు ఇవ్వలేదంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి అవార్డు అందించిన ఫొటోతోపాటు కేంద్రం పంపిన ఆహ్వాన పత్రికను ట్వీట్‌కు జతచేశారు.
మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
స్వచ్ఛ సర్వేక్షణ్, మిషన్ భగీరథలో రాష్ట్రం తరఫున అవార్డులు అందుకున్న అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. సీఎం కేసీఆర్ ఆలోచనకనుగుణంగా పనిచేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.