Hate Speech Bill | ‘తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం -2026’ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ అసెంబ్లీ తీర్మానించింది. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ‘నల్లబాలు కేసు’లో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుమారలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం’.. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు రెండేండ్లుగా పదే పదే చేస్తున్న ప్రచారం ఇది. కానీ ఇదంతా మేడిపండు చందమే అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని, సామాన్యుడి నోటికి కూడా సంకెళ్లు వేసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం-2026’ బిల్లును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని అంటున్నారు. ఈ బిల్లు సోమవారం శాసనసభలో సెలక్ట్ కమిటీకి పంపేందుకు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చట్టం ఉద్దేశాలు, కారణాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. డిజిటల్, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇటీవల విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయని వాపోయారు.
ఇవి మతం, కులం, జాతి, లింగం, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శతృత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహిస్తూ, సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఇవి వేగంగా వ్యాప్తిచెంది ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అందుకే వాటిని సమర్థంగా నివారించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, బాధిత వ్యక్తులకు రక్షణ, పరిహారం అందించడానికి చట్టం అవసరమని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించడమే బిల్లు లక్ష్యమని చెప్పారు.
ఈ చట్టంలోని సెక్షన్-2 ప్రకారం జీవించి ఉన్న, మరణించి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనం పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక వర్గం లేదా వ్యక్తుల సమూహం లేదా సముదాయానికి హాని కలిగించేలా, వారిపై విరోధభావం, శతృత్వభావం, దురభిప్రాయం కల్పించేలా మాట్లాడినా, రాసినా, సంకేతాల ద్వారా దృశ్యరూపకంగా, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వ్యాప్తిచేసినా, ప్రచురించినా నేరంగా పేర్కొన్నారు. సెక్షన్-2(4) ప్రకారం ‘సమాచార మార్పిడి’ చేసుకున్నా కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా, ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం లేదా ఇతర మార్గాల్లో దురుద్దేశాలను ప్రచారం చేస్తే కేసులు పెట్టే అధికారం కల్పించారు. ఇదే సమయంలో సెక్షన్-8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా, విచారణ లేక ఇతర న్యాయపరమైన చర్యలు చేపట్టకూడదని పేర్కొన్నారు.
సెక్షన్-3 (1) (i) ప్రకారం ద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా ఏడేండ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల వరకు జరిమానా విధిస్తారు. (ii) ప్రకారం.. ఎవరైనా మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే రెండేండ్లకు తక్కువ కాకుండా, పదేండ్ల వరకూ జైలుశిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్-3 (2) ప్రకారం న్యాయస్థానం నేర తీవ్రత ఆధారంగా కలిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితుడికి నష్టపరిహారం నిర్ణయిస్తుంది. సెక్షన్-3 (3) ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. మొదటి తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌చే విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్-5 ప్రకారం.. నేరం చేసినది ఒక సంఘం లేదా ఒక సంస్థ అయితే, నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులు అవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని, ఆ నేరం జరుగకుండా నివారించేందుకు తాను జాగ్రత్త తీసుకున్నానని నిరూపిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఈ నిబంధనతో ప్రభుత్వంపై విమర్శలు చేసే సంస్థలను టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సంస్థ నిర్వాహకులందరినీ బాధ్యులు చేయడం సరికాదని పేర్కొన్నారు.
చట్టంలోని సెక్షన్-6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమై, ప్రసారమైన కంటెంట్‌ను తొలిగించే అధికారం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన అధికారికి ఆయా మాధ్యమాల్లో ప్రచురితమైన, ప్రసారమైన కంటెంట్ ద్వేషపూరితమైనదని భావిస్తే తొలగించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. దాన్ని తొలగించాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సహా ఏదైనా సర్వీస్ ప్రొవైడరు, మధ్యవర్తులను, వ్యక్తులను ఆదేశించే అధికారం ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
స్థూలంగా చూడటానికి ఈ బిల్లు బాగానే అనిపిస్తున్నా, అందులో ప్రతిపాదించిన అంశాలను విశ్లేషిస్తే ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకులను శిక్షించేందుకు రూపొందించినట్టు స్పష్టం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందలేదనే బాధతో ప్రభుత్వాన్ని తిట్టినా, క్షణాకావేశంలో సోషల్‌మీడియాలో పోస్టు పెట్టినా ‘హేట్ స్పీచ్’ పరిధిలోకి రావొచ్చని పేర్కొంటున్నారు. మీడియాలో ఆర్టికల్స్ రాసినా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు వేసినా సంకెళ్లు పడుతాయని హెచ్చరిస్తున్నారు. ఏదైనా వ్యవస్థలో ఒక వ్యక్తి విద్వేషపూరితంగా ప్రవర్తిస్తే, ఆ వ్యవస్థ మొత్తం పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చని వివరించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా, డిజిటల్ మీ డియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను తమ గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారని, గరిష్ఠంగా పదేండ్ల వరకూ జైల్లో మగ్గాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సామాన్యుడి నోటికి తాళం, చేతికి సంకెళ్లు వేసేందుకే ఈ చట్టానికి రూపకల్పన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.