Telangana | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ‘ఒక వ్యక్తికి రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు దొరుకుతుంది. అత్యాశకు పోయి మొత్తం బంగారం ఒకేసారి తీసుకుందామని దాన్ని కోస్తాడు..’ ఆ తర్వాత ఏం జరుగుతుందో, దాని సారాంశం ఏమిటో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన రాష్ర్టాన్ని అలాగే చేసిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘బంగారు తెలంగాణ’ నినాదంతో దూసుకెళ్లిన రాష్ర్టాన్ని ‘తిరోగమన తెలంగాణ’గా మార్చారంటూ వారు మండిపడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఆర్థిక రంగం.. కేవలం 15 నెలల పాలనలో తిరోగమన దిశగా సాగడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్తున్నారు. ‘ఇక్కడ లంకెబిందెలు దొరుకుతాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలను బట్టే అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి ఎందుకు వచ్చారో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఓవైపు అసంబద్ధ నిర్ణయాలు, మరోవైపు అసమర్థ పాలన.. అన్నింటికీ మించి ‘దివాలా’ ప్రచారం రాష్ట్ర పరపతిని దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తం చేస్తునాన్నరు. ఫలితంగా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా రెవెన్యూ రాబడుల్లో తిరోగమనం నమోదైందని అంటున్నారు. కరోనా తర్వాత ఆ స్థాయిలో ఆర్థిక రంగానికి కాంగ్రెస్ పాలన విపత్తుగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిలోనే రూ.30వేల కోట్ల నష్టం..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం సగటున ప్రతీ సంవత్సరం రూ.14వేల కోట్లు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందని కాగ్‌కు సమర్పించిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. 2023-24తో పోల్చితే 2024-25 జనవరి నాటికి రెవెన్యూ వసూళ్లు రూ.13 వేల కోట్లు తక్కువగా నమోదైనట్టు కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. అంటే ప్రతీ త్రైమాసికానికి సగటున రూ.4వేలు నష్టపోయిందన్నమాట. ఈ లెక్కన చివరి త్రైమాసికం కూడా గణిస్తే రూ.16 వేల కోట్ల వరకు లోటు తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే.. ఏటా పెరగాల్సిన రూ.14వేల కోట్లు రాకపోగా, రావాల్సిన ఆదాయంలోనే రూ.16వేల కోట్లు రాష్ట్రం నష్టపోయిందని చెప్తున్నారు. దీనిని బట్టి ఏడాది కాలంలోనే ఏకంగా రూ.30 వేల కోట్లు నష్టపోయినట్టని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ అప్పు.. లక్షన్నర కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల్లో అధికారికంగా చేసిన అప్పులు లక్షన్నర కోట్లు దాటాయి. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,52,918 కోట్లకు చేరుకుంది. 459 రోజుల్లో రోజుకు సగటున రూ.333 కోట్లకుపైగా అప్పు చేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి రాష్ట్ర సర్కారు అప్పులు చేసింది. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.49,255 కోట్లుగా విధించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలి మూడు త్రైమాసికాల్లో (నిగతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) రూ.41,759 కోట్లు రుణం తీసుకున్నది. అంటే.. కేంద్రం అనుమతించిన అప్పులో జనవరి నాటికి ఇంకా రూ.7,500 కోట్లు మాత్రమే మిగిలింది. కానీ ప్రభుత్వం ప్రస్తుత చివరి త్రైమాసికంలో (జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో) ఏకంగా రూ.30 వేల కోట్ల అప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఫలితంగా కొన్ని వారాల పాటు ఆర్బీఐ బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేదు.
రేవంత్ తెచ్చిన అప్పులు ఏం చేసినట్టు?
రాష్ట్ర ప్రభుత్వం చేసిన లక్షన్నర కోట్లతో ఏం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. గత 15 నెలల్లో ఒక్క భారీ ప్రాజెక్టునైనా చేపట్టిందా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, భారీ భవనాలు, రోడ్లు, కాలేజీలు.. ఇలా అనేక ఆస్తులు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల రుణంతో రాష్ర్టానికి సృష్టించిన ఆస్తి ఒక్కటి కూడా లేదని, సంక్షేమ పథకాలైనా సక్రమంగా అమలవుతున్నాయా? అంటే అదీ లేదని చెప్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ విషయంలో హెచ్చులకు పోయి తీసుకున్న తప్పుడు నిర్ణయాలు భస్మాసుర హస్తంగా మారిపోయాయని అంటున్నారు. రుణమాఫీ చేసే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అధికారులు మొత్తుకుంటున్నా, దానికి బదులు రైతు భరోసా ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచించినా చెవిన పెట్టలేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది.
కేసీఆర్ తెచ్చిన నిధులు రాష్ర్టాభివృద్ధికే..
‘అప్పును భారంగా చూడకుండా.. పెట్టుబడిగా భావించాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెడితే దానికి సార్థకత చేకూరుతుంది. అప్పుకు మించిన ఆదాయం, అంతకుమించిన ప్రయోజనాలు కనిపిస్తాయి’ అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ నియమాన్ని అక్షరాలా పాటించింది. రుణాల రూపంలో సేకరించిన అప్పులను మూలధన వ్యయంగా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసింది. సంపదను సృష్టించింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఎండిన పొలాలను నదీజలాలతో తడిపి వ్యవసాయాన్ని పండుగ చేసింది. ఫలితంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. మౌలిక వసతుల అభివృద్ధితో పారిశ్రామిక, రవాణా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల రూపురేఖలే మారిపోయాయి. ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో పంచింది. తద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్లింది, ఇది కొనుగోళ్లు, పెట్టుబడుల రూపంలో తిరిగి మార్కెట్లోకి వచ్చింది. తద్వారా పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఇలా పదేండ్లలో చేసిన అప్పులను సక్రమంగా ఖర్చు చేయడంతో.. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి.
తెలంగాణ ఏర్పడేనాటికి సొంత పన్నుల ఆదాయం కేవలం రూ.29వేల కోట్లు. కానీ పదేండ్లలోనే రూ.1.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే నాలుగు రెట్లకుపైగా వృద్ధి నమోదైంది. అప్పులను సక్రమంగా ఖర్చు చేస్తే రూపురేఖలే మార్చవచ్చనడానికి వ్యవసాయ రంగం ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ ఏర్పడేనాటికి 20 లక్షల ఎకరాలకే సాగునీరు అందేది. పదేండ్ల తర్వాత 1.03 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు అనేక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా సాగునీరు అందించడం, చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వల్లే సాధ్యం అయ్యింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. 2004-2014 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.38,405.12కోట్లు వెచ్చించగా, కొత్తగా వచ్చిన ఆయకట్టు 5.71లక్షల ఎకరాలు మాత్రమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం రూ.1,64,210 కోట్లు. 2014-2023 మధ్య సాగులోకి తీసుకొచ్చిన ఆయకట్టు 17.23 లక్షల ఎకరాలు. ఫలితంగా పంట ఉత్పత్తులు పెరిగాయి. రైతులకు ఆదాయం సమకూరింది. ఇది కొనుగోళ్లు, పెట్టుబడుల రూపంలోకి మారింది.
దెబ్బతీసిన ‘దివాలా’ ప్రచారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు.. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పూట గడవడమే కష్టంగా ఉన్నదని ప్రచారం మొదలు పెట్టింది. స్వయంగా రేవంత్‌రెడ్డి అనేక వేదికల్లో ఈ విషయాన్ని చెప్పారు. ఇది రాష్ర్టానికి మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. మనం బాగున్నామని చెప్తేనే ఎవరైనా రూపాయి అప్పు ఇస్తారు. మనల్ని నమ్మి పెట్టుబడి పెడతారు. అలా కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని చెప్తే దగ్గరికి కూడా రారు. కానీ కాంగ్రెస్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర పరువును బజారున పడేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ‘కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యింది’ అంటూ విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రచారం చేసింది. ‘రాష్ర్టానికి ప్రతి నెల వచ్చే ఆదాయం సరిపోవడం లేదు.. మళ్లీ అప్పు చేయాల్సి వస్తున్నది’ అంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. పరోక్షంగా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందనే సందేశాన్ని ఇచ్చారు. కేవలం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో చేసిన ఈ ప్రచారం రాష్ర్టానికే శాపంగా మారిందని ఆర్థిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ నుంచి ఆర్థిక పతనం..
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా ఆర్థికరంగం పతనం ఎప్పుడో మొదలుకాగా.. నవంబర్ నుంచి మరింత దిగజారింది. ప్రభుత్వం స్వయంగా కాగ్‌కు సమర్పించిన నివేదికలోనే ఈ వివరాలను వెల్లడించింది. నిరుడు నవంబర్ నాటికి ఖజానాకు రూ.1,11,141.37 కోట్ల రెవెన్యూ రాబడులు రాగా.. ఈసారి రూ.1,03,300 కోట్లుగా నమోదైంది. అంటే రూ.7,841.33 కోట్లు (7.05 శాతం) తగ్గుదల కనిపించింది. వాస్తవానికి రాబడుల పరంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఏటికేడు వృద్ధి సాధిస్తున్నది. కరోనాతో 2020-21లో ఆదాయం పడిపోయినా.. ఆ మరుసటి సంవత్సరమే కోలుకున్నది. కానీ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఆదాయం నవంబర్ నుంచి తిరోగమనం వైపు సాగుతున్నది. ఇక.. జనవరి వరకు ఈ ఆర్థిక సంవత్సరం పది నెలలకు సంబంధించిన నివేదికను పరిశీలిస్తే.. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో సగం మాత్రమే వచ్చింది. 2024-25 బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2,21,242 కోట్లుగా అంచనా వేయగా, జనవరి నాటికి రూ.1,23,815 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 55.96 శాతం మాత్రమే నమోదైంది. నిరుడు ఇదే కాలానికి రెవెన్యూ రాబడులు 63.20 శాతంగా ఉండటం గమనార్హం. ఇక ఏటికేడు పోల్చిచూసినప్పుడు రెవెన్యూ రాబడుల్లో భారీ క్షీణత నమోదైంది. నిరుడితో పోల్చితే జనవరి నాటికి రెవెన్యూ రాబడుల్లో రూ.13,044.9 కోట్లు లోటు నమోదైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లలోనూ తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది రూ.58,594.91 కోట్లుగా అంచనా వేయగా రూ.42,657.9 కోట్లు వచ్చాయి. లక్ష్యంలో ఇది 72.8 శాతం మాత్రమే. ఇదే సమయానికి నిరుడు జీఎస్టీ వసూళ్లు 75 శాతం నమోదయ్యాయి.
పదేండ్లుగా నవంబర్ నాటికి ఆదాయం (రూ. కోట్లలో) పెరుగుదల ఇలా..
కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక వృద్ధి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా రాకెట్ వేగంతో వృద్ధి సాధించిందనడానికి గణాంకాలే నిదర్శనం. సాధారణంగా ఒక రాష్ట్రం లేదా ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి నాలుగు కీలక అంశాలు ఉంటాయి. సొంత రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, బడ్జెట్. వీటితోపాటు అప్పులు అదుపులో ఉండటం కూడా ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా పేర్కొంటారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు అంశాల్లోనూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
‘దీర్ఘకాలిక ప్రయోజనాలు, రాష్ర్టానికి వచ్చే పెట్టుబడుల దృష్ట్యా రాష్ట్రం బాగున్నదనే చెప్పాలి. లేదంటే రాష్ట్ర పరపతి దెబ్బతింటుంది, పెట్టుబడిదారులకు నమ్మకం పోతుంది.’– గత సంవత్సరం మే నెలలో కేసీఆర్ చేసిన సూచన ఇది.
‘రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బీమారీ రాష్ట్రంగా చూపించొద్దు. ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళ్తే తీరని నష్టం జరుగుతుంది.’
– 2023 డిసెంబర్లో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ చేసిన హెచ్చరిక
‘రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చారు. ప్రతీ నెల వచ్చే ఆదాయం, చేస్తున్న అప్పులు కూడా సరిపోవడం లేదు.’
– సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చేస్తున్న ప్రచారం..
ప్రతిపక్షాన్ని తిట్టడంపై తప్ప పాలనపై శ్రద్ధ లేకపోవడంతో రాష్ర్టానికి గుండెకాయ వంటి ఆర్థికరంగం తిరోగమన దిశగా సాగుతున్నది.
స్తంభించిన జీఎస్టీ రాబడులు
జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్ధత నెలకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.5,280 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఒక శాతం మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో ఏటికేడు వృద్ధి నమోదైంది. అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది. మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే వృద్ధిరేటు మందగించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెప్తున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, పెట్టుబడి సాయం అందించక, సరైన సమయంలో పంట కొనుగోళ్లు చేయక వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నదని అంటున్నారు. ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిల్లాడుతున్నది. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిరేటు నమోదు కావడం లేదని, పరిశ్రమలు వెళ్లిపోతున్న పరిస్థితి ఉన్నదని పేరొంటున్నారు. ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతింటుండటంతో దేశంలోనే అతి తకువ జీఎస్టీ వసూళ్ల వృద్ధితో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని చెప్తున్నారు.
నేలకరిచిన ‘రియల్ ’ రంగం
హైడ్రా, మూసీ సుందరీకరణ, ఎఫ్టీఎల్ పేరుతో బెదిరింపులు, విచ్చలవిడి వసూళ్లు.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంపై అనేక కోణాల్లో దాడి జరుగుతూనే ఉన్నది. ఫలితంగా 14 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం నేలకరించిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు జూన్‌లో హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గడం మొదలైంది. ఈ ఏడాది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,228.82 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, పది నెలలు గడిచిన తర్వాత జనవరి నాటికి రూ.5,821.88 కోట్లు (31.94 శాతం) మాత్రమే వచ్చాయి. నిరుడు ఇదే సమయానికి ఆ శాఖ ద్వారా రూ.11,700 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈసారి సగానికి పడిపోయినట్టు లెక. కరోనా కాలంలోనూ పెద్దగా ప్రభావితం కాని రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలనలో కుదేలైందని ఆ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రియల్ రంగంతో ఆగిపోలేదని, దీని ప్రభావం ఇతర రూపాల్లో ఖజానాపై కనిపించిందని చెప్తున్నారు.
కేసీఆర్ హయాంలో చేసిన అప్పు..
అప్పు జీఎస్డీపీలో శాతం