హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ) : కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తు న్న నీటి అవసరాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తద్వారా ఆదా అయ్యే నీటిని బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యా యవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను వినిపించారు.
సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లే ప్రాంతాలకు సాగునీటి అవసరం ఉండబోదని తెలిపారు. ఆ నీటిని బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించాలని వాదించారు. ఎన్సీపీ కుడి కాల్వ కింద ఆయకట్టులో కొంత భాగానికి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటిని ఎత్తివేయడం వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సాగునీటిని అందించవచ్చని తెలిపారు. ఏపీ పదకొండేండ్లుగా ప్రస్తుత ప్రాజెక్టులకు ఉపయోగించకుం డా బేసిన్ వెలుపలకి నీటిని తరలిస్తున్నదని, పెన్నా, ఇతర బేసిన్లలో ఏపీకి 360 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యముందని, ఆ నిల్వకు 1.4 రెట్లు నీటిని ఉపయోగించుకునే అవకాశముందని వాదించారు. తాజాగా బొల్లేపల్లి జలాశయాన్ని 150 టీఎంసీలతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుందని గుర్తుచేశారు. విచారణకు తెలంగాణ తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు, ఇతర న్యాయవాదులు, ఐఎస్డబ్ల్యూఆర్ యూనిట్ ఇంజినీర్లు హాజరయ్యారు.