హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సోనియాగాంధీకి కృతజ్ఞత చెప్పడం కోసమే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఒక దఫా మంత్రిగా పని చేసిన జూపల్లి, అలాగే ఒక దఫా ఎంపీగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గుర్తుకురాని కృతజ్ఞత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, పదవులు, టికెట్లు దక్కవని తెలిశాక వీళ్లు కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి ఆ పార్టీని గెలిపించాలా? అని నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదేండ్లకు సోనియాగాంధీకి కృతజ్ఞత చెప్తామనటం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉన్నదని అంటున్నారు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపించాలి? ఏది అనివార్యమో మాకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ బద్ధవిరోధి అయిన చంద్రబాబు పంచన చేరిన తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంచుకున్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని వీళ్లు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక మాట తప్ప కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేని భావ దారిద్రం కలిగిన ఈ నాయకులు చెప్పేది తాము ఎందుకు వినాలి? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ బహిష్కరించాక ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనలు పడిన వీరు సొంత పార్టీ పెడుతామని ఒక్కసారి, బీజేపీలో చేరడానికి చర్చలు జరిపి, దిక్కులేక చివరకు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌లో చేరిన వీరా! తమకు చెప్పేది అని మండిపడుతున్నారు.