హైదరాబాద్, డిసెంబర్20 (నమస్తే తెలంగాణ): కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్, సభ్యులు శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది. సీడ్ పథకం అర్హుల ఎంపికకు డీఎన్టీ(డీ నోటిఫైడ్ ట్రైబ్స్) సర్టిఫికెట్ జారీపై కమిషన్ తరఫున ఢిల్లీలోని డీఎన్టీ బోర్డును సందర్శించిన అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు.
నిబంధనల మేరకు రాష్ట్రంలో సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని, ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఇటీవల ఎన్నికైన సర్పంచ్, వార్డుమెంబర్ల కుల వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి కోరాలని అధికారులకు కమిషనర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 343 ప్రభుత్వ విభాగాలకు 333 విభాగాల నుంచి ఉద్యోగుల కుల వివరాలు అందాయని, మిగతా 10 విభాగాలు కూడా సత్వరమే సమర్పించాలని ఆదేశించారు.