సిరిసిల్ల రూరల్, మే 10: సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతున్న తనను స్వదేశానికి రప్పించాలని.. వైద్య ఖర్చులు అందించి ఆదుకోవాలని కోరుతూ స్థానిక నాయకులకు సెల్ఫీ వీడియో పోస్ట్‌చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మంద మహేశ్ గతేడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారంలో పాల్గొన్నాడు. తర్వాత ఉపాధి కోసం సౌదీకి వెళ్లి ఏసీ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 15 రోజుల క్రితం మహేశ్ వెళ్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా, మహేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి సౌదీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. నడుము, కాళ్లు విరిగి అచేతనస్థితిలో ఉన్న దయనీయ పరిస్థితిని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి పార్టీ శ్రేణులకు పంపాడు. తనను స్వదేశానికి తీసుకురావాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. స్థానిక నాయకులు, సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి, మహేశ్‌ను స్వదేశానికి రప్పించేలా ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. మహేశ్‌ను ఇంటికి తీసుకురావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.