సిద్దిపేట, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి తెలంగాణను అభివృద్ధి చేసిండు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడు తెలంగాణను మోసం చేస్తడా? కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను నిజం చేసిండు కేసీఆర్’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. అబద్ధాలు, మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గద్దెనెక్కారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద, ప్రజల మీద శ్రద్ధలేదని దుయ్యబట్టారు. గురువారం సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. 29 నవంబర్ 2009 చరిత్రను మలుపు తిప్పిన రోజు అని పేర్కొన్నారు.
‘నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు.. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎకడిది? రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎకడిది?’ అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చింది కాబట్టే దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కూ, కాంగ్రెస్ నాయకులకు పోలిక అసలే లేదని వ్యాఖ్యానించారు. ‘కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తరు. మరి మలన్నసాగర్, కొండపోచమ్మలో నీళ్లెక్కడివి? కాలువలు తవ్వి నీళ్లు ఇస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని ఆ పనిఆపేశారని విమర్శించారు.
నవంబర్ 29న పొద్దునే ఉద్యమంలో నేను.. అని మీ ఉద్యమ జ్ఞాపకాలను ట్విట్టర్, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాంలో కానీ డిసెంబర్ 9 వరకు రోజుకొక పోస్ట్ చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
హత్నూర: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. గురువారం హైదరాబాద్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో హత్నూర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ పొట్లచెర్వు ఆంజనేయులు, శరత్చంద్ర, మల్లేశం, నర్సింహారెడ్డి, అరవింద్‌బాబుతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతించారు.