ఆడబిడ్డల సంబురం ఇది.. మేనమామను యాదిజేసుకొనే వేడుక ఇది.. రాష్ట్ర మహిళలంతా ఆనందంగా చేసుకొంటున్న పండుగ ఇది.. రాఖీలు, క్షీరాభిషేకాలతో చాటుకొన్న అభిమానం ఇది.. కేసీఆర్ అక్షరాలతో పేర్చిన మానవహారం ఇది.. మొత్తంగా ‘కేసీఆర్ మహిళాబంధు’ ఇది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా పథకాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ గుర్తుచేసుకొంటూ టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో మహిళాబంధు సంబురాలు అంబరాన్నంటాయి.
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి మంగళవారం దాకా మూడు రోజులపాటు టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఊరూరా ఉత్సవాలను నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపుతో.. కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఉత్సాహభరితంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫొటోకు ఆడబిడ్డలు రాఖీ కట్టగా, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ‘థాంక్యూ కేసీఆర్’ ఆకారం వచ్చేలా మహిళలు మానవహారాలు ఏర్పాటుచేశారు. బోనాలు, బతుకమ్మలతో ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. రాఖీ కట్టడం కోసం అనువుగా ఉండేందుకు టీఆర్ఎస్ నేతలు కూడళ్లలో కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని మహిళలు ఎడ్లబండిపై ఊరేగించారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. సిద్దిపేటలో మహిళా పథకాలను చీరపై ముద్రించి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా మూడు రోజుల ఉత్సవాల్లో తొలి రోజు కార్యక్రమాలను పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఘనంగా నిర్వహించారు.
బాన్సువాడలోని స్టేడియంలో నిర్వహించిన సంబురాలను ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన మెటర్నిటీ వార్డులోని బాలింతలకు మంత్రి సత్యవతిరాథోడ్ కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే తెలంగాణలోనే పుట్టాలనేలా మహిళల ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. మహిళల అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. అందుకు కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాలను ఉదహరించారు. వనపర్తి క్యాంప్ కార్యాలయంలో సంబురాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సూర్యాపేట, చౌటుప్పల్‌లో మహిళాబంధు వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. యావత్తు తెలంగాణ ప్రజానీకంతోపాటు మహిళా లోకమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఖమ్మంలోని మమత దవాఖాన ప్రాంగణంలో జరిగిన సంబురాల సభలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, మహిళలందరికీ పెద్దన్నగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఘట్కేసర్, పోచారం, కీసర, దమ్మాయిగూడ, జవహార్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, స్వయం సంఘాల ప్రతినిధులకు చీరలను పంపిణీ చేశారు. పీవీ మార్గ్‌లో జరిగిన వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు.
కేసీఆర్‌తోనే మహిళా సాధికారత: జీవన్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌తోనే మహిళా సాధికారత సాధ్యమని, కనీవినీ ఎరుగని రీతిలో మహిళలకు పథకాలు తీసుకొచ్చారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో సంబురాల్లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ప్రధాని అయితేనే దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లోని మహిళలకు ఈ పథకాలు అంది, వారికి విముక్తి లభిస్తుందని వ్యాఖ్యానించారు.
మహిళాబంధులో నేడు..
కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు (సోమవారం) మహిళా సంక్షేమ కార్యక్రమాల (కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలు) లబ్ధిదారులను వారి ఇండ్ల వద్దకు వెళ్లి కలవడం. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం తెలంగాణ భవన్లో మహిళాబంధు కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతీరాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు అవుతారని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి తెలిపారు. ఇదిలా ఉండగా, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం 3కే వాకథాన్‌ను నిర్వహించనున్నట్టు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు.
అద్భుత పథకం: మంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ కిట్‌ను మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుత పథకంగా ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను మంత్రి రీట్వీట్ చేశారు. ‘మాతాశిశు సంరక్షణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుత పథకం కేసీఆర్ కిట్. ఆడబిడ్డ జన్మిస్తే రూ.13వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలు ఆర్థిక సాయంతోపాటు తల్లీబిడ్డల సంరక్షణకు అవసరమైన 16 వస్తువులతో కూడిన కిట్ అందజేత’ అని టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా, మంత్రి దాన్ని రీట్వీట్ చేశారు.
ఆడబిడ్డ పుడితే రూ.5,116
మహిళా దినోత్సవం సందర్భంగా చెర్లబూత్కూర్ సర్పంచ్ ప్రకటన
ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడి
కరీంనగర్‌రూరల్, మార్చి 6: మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌రూరల్ మండలం చెర్లబూత్కూర్ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం గ్రామంలో ఆడబిడ్డ పుడితే.. ఆమె పేరిట రూ.5,116లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, పత్రం అందించనున్నట్టు వెల్లడించారు. మహిళాదినోత్సవం నుంచి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడ బిడ్డ వివరాలను అంగన్వాడీ టీచర్లు, అశ వర్కర్లకు సమాచారం అందించాలని కోరారు.
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశంసలు
గొప్ప అడుగు.. కేసీఆర్ కిట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 3 రోజులే. మహిళా సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అని ఆనందంగా చెప్తున్నా. మహిళల విషయంలో తీసుకొన్న గొప్ప అడుగు.. కేసీఆర్ కిట్స్.
ప్రపంచంలోనే ఉత్తమం
ప్రపంచంలోనే ఒక ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం కేసీఆర్ కిట్ అని గర్వంగా చెప్తున్నా. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఇప్పటికే 13,30,000 మంది లబ్ధి పొందారు. ఇది తెలంగాణ విజయం.
తల్లీబిడ్డ సంరక్షణే ధ్యేయం
కేసీఆర్ కిట్‌లో.. తల్లీబిడ్డకు అవసరమైన 16 వస్తువులు ఉన్నాయి. ఆడబిడ్డ పుడితే ఆర్థిక సహాయంగా రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు కూడా అందజేస్తు న్నాం. డెలివరీ తర్వాత అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నాం.
300కు పైగా వాహనాలను అందుబాటులోకి తెచ్చాం.
థ్యాంక్స్ టూ కేసీఆర్ కిట్స్
-వేర్వేరు ట్వీట్లలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్