KCR : రాష్ట్రంలో తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా సాగిన తాగునీటి సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేక పోతున్నదో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం కలుషిత తాగునీటి వల్లే వస్తాయని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు చెబుతున్నారని, అందుకే రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పారు.
‘ప్రజలకు వచ్చే వ్యాధుల్లో 75 శాతం కలుషిత తాగునీటి ద్వారానే సంక్రమిస్తాయని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు తేల్చారు. అందుకే ఫ్లోరైడ్ సమస్యతోపాటు కలుషిత తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చినం. ఆ స్కీమ్‌ను కూడా ఈ ప్రభుత్వం ఎందుకు సరిగా నడపలేకపోతున్నదో నాకు అర్థం కావడం లేదు. నేను రెండు మూడు జిల్లాల్లో అధికారులకు ఫోన్లు చేసి ‘మిషన్ భగీరథను ఎందుకు సరిగా నడపలేకపోతున్నరు..?’ అని అడిగిన. ‘ఇన్నాళ్లు నడిపింది మీరే కదా.. ఇప్పుడేమైంది..’ అని ప్రశ్నించిన. దానికి వాళ్లు ‘సార్ మీరు ఓడిపోయినంక మా డిపార్టుమెంట్ల ఒక్కొక్కడు స్వాతంత్య్రం వచ్చినట్లు ఫీలైతున్నరు. ఒకని మాట ఒకడు వింటలేడు’ అని చెప్పిండ్రు. ‘చిన్న పైప్ ఫెయిలైనా వారం దాకా తిరిగి చూసే పరిస్థితి లేదు’ అని అన్నరు. ‘మీరున్నప్పుడు భయముండె. ఇప్పుడది లేదు. విచ్చలవిడి తనం వచ్చింది’ అని చెప్తున్నరు’ అని కేసీఆర్ తెలిపారు.
‘శుద్ధమైన జలాలు అందక నాలుగైదు నెలల స్వల్పకాలంలోనే ప్రజలు మళ్లీ ఉప్పు నీళ్లు తాగే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఉప్పునీళ్లు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చూడబోతున్నది. గతంలో కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు వేదికగా తెలంగాణకు సర్టిఫికెట్ ఇచ్చారు. వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ఇంత దుస్థితికి ఎందుకొచ్చింది..? మహిళలైతే ప్రభుత్వాన్ని తిట్టగూడని తిట్లు తిడుతున్నరు. బిందెలు మోస్తూ, ట్యాంకర్ల కాడ నీళ్లకు తిప్పలు పడుతూ భయంకరంగా తిడుతున్నరు. ప్రజల ఆగ్రహాన్ని ఈ ఎన్నికల్లో వీళ్లు (కాంగ్రెస్ పాలకులు) కచ్చితంగా చవిచూడబోతున్నరు’ అని ఆయన వ్యాఖ్యానించారు.