హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి, దూరదృష్టితో స్వరాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో కాళేళ్వరం ప్రాజెక్టు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక రైతు సంక్షేమ పథకాలు తేవడం ద్వారా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గిందని స్పష్టంచేశారు.
హైదరాబాద్ సిటీ కాలేజీలో ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ పరామర్శ’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును గురువారం ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాలభాస్కర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీ ప్రకాశ్ మాట్లాడుతూ.. బంగారంతో పోల్చితే నీరే విలువైనదన్నారు. జల సంరక్షణపై దృష్టి లేకపోతే భవిష్యత్తు తరం మనల్ని క్షమించదని చెప్పారు.
జలవనరుల పరిరక్షణకు రాష్ట్రంలో 46 వేల నీటి సంఘాలను నియమించామని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి ఉరకలు పెడుతున్నదని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణే నంబర్‌వన్‌గా ఉన్నదని స్పష్టంచేశారు. వచ్చే రెండేండ్లలో హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయ, కోఆపరేటివ్ శాఖ సెక్రటరీ రుఘునందన్రావు, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, ఆచార్య విజయ్, ఆచార్య డైసీ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి
ప్రపంచంలోని వివిధ నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. అది తెలంగాణ ఏర్పాటైన తర్వాతే సాధ్యమైంది. నగరం అభివృద్ధి చెందుతుండటం వల్లే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఐటీ, టీహబ్‌తో యువతకు పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
– అమిత్ జింగ్రాని, ఎస్బీ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్