ఖమ్మం, ఏప్రిల్ 9 : తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చెరిపేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని, బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం జిల్లా, నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన బుధవారం ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో అజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే రజతోత్సవాన్ని జయప్రదం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు.
సభ అనంతరం ఆన్లైన్ మెంబర్షిప్ కోసం కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. 2001లో పార్టీని స్థాపించిన ఉద్యమసారథి కేసీఆర్.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఛేదించి చావునోట్లో తలపెట్టి 2014లో స్వరాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. అలాంటి ధీశాలి సారథ్యంలో నడుస్తున్న పార్టీలో మనమందరమూ సభ్యులుగా ఉండడం గర్వకారణమని చె ప్పారు. ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టి 16 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ గ్యారెంటీలన్నింటినీ అటకెక్కించిందని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని స్పష్టంచేశారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్‌ను విడుదల చేశారు.