హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనం బయటకు రావాలనే జంకుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు ఆవర్తన ద్రోణుల ప్రభావంతో వచ్చే వారంపాటు పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నది. బుధవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5, నల్లగొండ జిల్లా నేరడుగొమ్మలో 41.5, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 41.4, జనగామ జిల్లా పాలకుర్తిలో 41.2, వరంగల్ జిల్లా సంగెంలో 41.2, హైదరాబాద్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.