ఖైరతాబాద్, మార్చి 28 : ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ పరీక్షలన్నింటినీ లోపభూయిష్టంగా నిర్వహించిందని తెలంగాణ విఠల్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, విద్యావేత్త పాలకూరి అశోక్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. 563 గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 31 వేల మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారని, 21వేల మంది పరీక్షకు హాజరయ్యారని వివరించారు.
కానీ, పరీక్షల్లో ఎక్కడా ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. దరఖాస్తుల్లోనూ అనేక లోపాలున్నట్టు పేర్కొన్నారు. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లోనూ తప్పులు దొర్లాయని, పేపర్లు దిద్దడంలోనూ లోపాలు జరిగినట్టు తెలిపారు. వీటిపై విచారణ జరిపించాలని, ప్రతి పేపర్‌ను రీవాల్యుయేషన్ చేయించాలని, టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.