కందుకూరు, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన 70లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పల్లెలు, పట్టణాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం పుణ్యమా అంటూ నేడు ప్రతి గ్రామంలో పకృతి వనం, డంపింగ్ యార్డు, కంపొస్టు షెడ్డు, వైకుంఠ ధామం తదితర వసతులతో పల్లెల సమస్యలు తీరినట్లు మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి దిశగా పయనిస్తుందన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఒకప్పుడు చెత్త కుప్పలు, మురుగు నీటితో గ్రామాలు కంపు కొడుతే.. నేడు పచ్చని చెట్లు, పరిశుభ్రతకు అనవాళ్లుగా మారి ప్రజలకు ఆహ్లాదన్ని పంచుతున్నాయన్నారు. ప్రతి ఊరికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు గొప్ప విషయమన్నారు. దీంతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
అలాగే బడి బాటకు విశేష స్పందన వస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.