జనగామ, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకను సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. యశ్వంతపూర్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండాను, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి, కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతు ఇవ్వకపోగా, బాబు లేఖ ఇవ్వకుండా అడ్డుపడిన ద్రోహులు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులకు తెలంగాణ గురించి, అమరవీరుల త్యాగాల గురించి మాట్లాడే హక్కులేదని స్పష్టంచేశారు.
కేసులకు భయపడేది లేదు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఎన్నికల సమయంలో తాను ఏదైనా తప్పు చేస్తే ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలి కానీ ఒక కాంగ్రెస్ నాయకుడు ఒత్తిడి చేస్తే జనగామ పోలీసు అధికారులు తనపై కేసు నమోదు చేయడం చాలా దారుణం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. గ్రామాల్లో చిన్నచిన్న భూవివాదాల్లో తలదూర్చి డబ్బులు గుంజుతున్నారని పోలీసుల తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు. శృతిమించితే వీటన్నింటి చూస్తూ ఊరుకోమని, అవసరమైతే ప్రజల కోసం పెద్దఎత్తున ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు.