హైదరాబాద్ : ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ.. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ అందాలకు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు తెలంగాణ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న FITUR – 2023లో తెలంగాణ టూరిజం ప్రమోషన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వైభవాన్ని మంత్రి ఎలుగెత్తి చాటారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ టూరిజం రాకేష్ వర్మ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాకేష్ థామస్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల స్వర్గధామంగా నిలవబోతుందన్నారు. తెలంగాణలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన టూరిజం ప్రాంతాలు, పురావస్తు, వారసత్వ కట్టడాలు చారిత్రక, సాంస్కృతి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా ఎంతోమంది విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నామన్నారు. బుద్ధిజం పూర్వ వైభవానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రపంచ స్థాయిలో బుద్ధిజం ప్రాజెక్టును అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, వరల్డ్ బెస్ట్ విలేజ్ పోచంపల్లి ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రూ. 1400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బిర్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందన్నారు.
గత కొవిడ్ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయడం ద్వారా హైదరాబాద్ ఘనకీర్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టు కాలేశ్వరానికి అనుబంధంగా నిర్మించిన రిజర్వాయర్లను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ కేసీఆర్ ఎకో టూరిజం పార్కును మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.