హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ మరోసారి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన నిలిచాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని 40 పట్టణాలు ఓడీఎఫ్++ను సాధించడం విశేషం. దక్షిణ భారత్‌లోని ఇతర రాష్ర్టాలన్నింటిలో కలిపి 20 పట్టణాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. తెలంగాణలో మరో 70 పట్టణాలు ఓడీఎఫ్+ క్యాటగిరీలో చేరాయి. రాష్ట్రంలో పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి 1,000 మందికి ఒక ప్రజా మరుగుదొడ్డిని నిర్మించడం, వాటి నిర్వహణకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించడం, దేశంలోనే అతి ఎక్కువ ఎఫ్ఎస్టీపీలను నిర్మించడం తదితర కారణాలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) జాతీయ స్థాయిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ ఇస్తుంది. తెలంగాణలోని అన్ని పట్టణాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పట్టణాలుగా 2019 లోనే గుర్తింపు పొందాయి. తదుపరి దశగా ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్‌గా ఉన్నాయి.
రాష్ట్రంలో 9,088 పబ్లిక్ టాయిలెట్స్
పట్టణప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని 141 పట్టణాలు, నగరాల్లో కొత్తగా 4,118 ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. వీటిలో 54 మహిళల కోసమే కేటాయించారు. మరో 32 మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటుచేశారు. మొత్తంగా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 9,088 టాయిలెట్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పే అండ్ యూజ్ విధానంలో నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించడానికి పట్టణప్రగతి టాయిలెట్ మానిటరింగ్ సిస్టం (పీపీటీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. వారానికి రెండుసార్లు ప్రతి మంగళవారం, శుక్రవారం మరుగుదొడ్లను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 18 అంశాలను పరిశీలించి ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనితోపాటుగా ప్రజా మరుగుదొడ్లను వినియోగించే వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. తెలంగాణలో చేపట్టిన ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
ఎఫ్ఎస్టీపీలు కీలకం
రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాలు ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు పొందడంలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎఫ్ఎస్టీపీ) ముఖ్యపాత్ర పోషించాయి. రాష్ట్రంలో మొత్తం 139 ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇందులో 71 ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)- హైబ్రిడ్ యాన్యూటి మాడల్, మరో 68 ఎఫ్ఎస్టీపీలను ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో నిర్మిస్తున్నారు. వీటిలో 16 ఎఫ్ఎస్టీపీలు పూర్తి అయ్యాయి. ఈ విధానంలో సెప్టిక్ ట్యాంకులను మూడేండ్లకు ఒకసారి శుభ్రం చేస్తారు.