హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): అటవీ వనరుల అభివృద్ధి, నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుతోపాటు అడవి బిడ్డలకు జీవనోపాధి కల్పించడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ.. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ ఎయిడ్), కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సంయుక్తంగా ప్రారంభించిన ‘ఫారెస్ట్ ప్లస్ 2.0’ ప్రాజెక్టు అమలులో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 56 డివిజన్ల పరిధిలోని అటవీ వనరుల సమాచారాన్ని ‘డెసిషన్ సపోర్ట్ టూల్’లో పొందుపర్చడమే ఇందుకు కారణం.
దేశంలో అడవుల నిర్వహణను బలోపేతం చేసేందుకు యూఎస్ ఎయిడ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సంయుక్తంగా ఈ టూల్‌ను రూపొందించాయి. దీనిని ఉపయోగించి అటవీ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా సమీపంలోని ఆదివాసీ, గిరిజనులకు ఆర్థిక అవకాశాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో 2019లో ‘ఫారెస్ట్-ప్లస్ 2.0’ ప్రాజెక్టును తెలంగాణతోపాటు కేరళ, బీహార్‌లో ప్రారంభించారు. 1.2 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలోని అడవుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు ఆర్థికంగా దోహదపడే 3 ప్రోత్సాహక వ్యవస్థలు, 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 12 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.98 కోట్ల) విలువైన ఆర్థిక ప్రయోజనాలను అందించే కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. 2019 నవంబర్ 20న మెదక్ జిల్లా పోచారం వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును రాష్ట్ర అటవీశాఖ విజయవంతంగా నిర్వహిస్తున్నది.

దేశంలో తొలి రాష్ట్రం
‘ఫారెస్ట్-ప్లస్ 2.0’లో భాగంగా 40 అంశాల్లో యూఎస్ ఎయిడ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యధికంగా 56 డివిజన్లలో డాటాను సేకరించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేరళలో 5, బీహార్‌లో 3 డివిజన్లలో మాత్రమే డాటాను సేకరించినట్టు యూఎస్ ఎయిడ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లా పోచారంలోని 56 వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో వాటర్ షెడ్లు, ల్యాండ్‌స్కేప్స్, ఎకో టూరిజం స్పాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫారెస్ట్ బీట్‌లో సుమారు 200 హెక్టార్ల అటవీ భూమిని అభివృద్ధి చేస్తున్నారు.