Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెన్సార్‌కు సంబంధించిన సమస్యల కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతుండగా, ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ముందుగానే ప్రకటించారు.
గతంలో ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో ఎదురైన ఇబ్బందులతో ఆ ప్రణాళిక వాయిదా పడింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, గతేడాది డిసెంబర్లో చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిశీలనకు పంపారు. అయితే సినిమాలోని కొన్ని రాజకీయ అంశాలు, సంభాషణలపై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అనంతరం కొన్ని న్యాయపరమైన అంశాలు కూడా తెరపైకి రావడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.దాదాపు ఏడు నెలల తర్వాత ఇప్పుడు సెన్సార్ సమస్యలు పరిష్కార దశకు చేరుకున్నాయని కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో ‘జన నాయగన్’ చిత్రానికి CBFC ‘A’ సర్టిఫికేట్ జారీ చేసిందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారని పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ఇంకా సెన్సార్ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో క్లియరెన్స్ వచ్చే అవకాశముందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం లేదా CBFC నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ‘A’ సర్టిఫికేట్ మంజూరైందనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేం. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకసారి విడుదల తేదీ ప్రకటిస్తే, విజయ్ సినీ ప్రయాణానికి ముగింపు పలికే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.