Telangana | హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం,, ఎగుమతుల్లోనూ తనదైన ముద్ర వేసింది. దేశ ఔషధ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ తన పూర్వవైభవాన్ని కొనసాగిస్తూ నిరుడు కూడా భారీగా ఎగుమతులు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో గణనీయంగా అభివృద్ధి చెందిన ఔషధ రంగం, మొత్తం ఎగుమతుల్లో 32 శాతంతో అన్నింటికన్నా ముందున్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న టాప్-10 దేశాల్లో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాలున్నాయి. రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆదాయం, ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు తదితర వాటికోసం ఎగుమతుల రంగం ఎంతో ప్రధానమైనది.
2023-24లో సరుకులకు సంబంధించిన ఎగుమతులు రూ. 1,16,182 కోట్లు ఉండగా, ఇందులో అత్యధికంగా రూ. 36,893 కోట్ల విలువైన ఔషధాలు (32శాతం) ఎగుమతయ్యాయి. ఫార్మా తరువాత అత్యధికంగా ఎగుమతి అయిన సరుకుల్లో ఆర్గానిక్ కెమికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, విద్యుత్తు యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, మెకానికల్ వస్తువులు ఉన్నాయి. రాష్ర్టానికి చెందిన సరుకులను దిగుమతి చేసుకున్న దేశాల్లో 28.16 శాతంతో అమెరికా ప్రథమస్థానంలో నిలిచింది. 6.9 శాతంతో యూఏఈ, 5.2శాతంతో చైనా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల విషయానికొస్తే 29 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 2023-24లో రూ. 34,249కోట్ల విలువైన సరుకులు ఎగుమతి అయ్యాయి. రూ. 22 శాతం(రూ.25,444కోట్లు)తో మేడ్చల్ మల్కాజిగిరి, 19 శాతం(రూ. 21,939కోట్లు)తో సంగారెడ్డి, 17శాతం(రూ. 19,435కోట్లు)తో హైదరాబాద్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బయో ఫార్మాకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట
దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో మూడింట ఒక వంతు.. ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తులో ఐదింట ఒక వంతు తెలంగాణ నుంచే కావడం గమనార్హం. దీనినిబట్టి రాష్ట్ర ఎగుమతుల్లో ఫార్మా రంగం ఎంతో కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఆర్అండ్డీ క్లస్టర్‌గా పేరుగాంచిన జీనోమ్ వ్యాలీ నుంచే కొవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచానికి సరఫరా అయ్యాయి. ఇక్కడ భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశాయి. ఇక్కడ 200కుపైగా బయోటెక్ కంపెనీలు ఉండగా, వ్యాక్సిన్ తయారుచేసే ఐదు ప్రధాన కంపెనీల్లో నాలుగు ఇక్కడే ఉండడం మరో విశేషం. జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్(బీ-హబ్) ఏర్పాటు మరో కీలకాంశంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ అయిన సైటివా భాగస్వామ్యంతో ఇక్కడ బయో ఫార్మా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. లైఫ్ సైన్సెస్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2,000కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ను కూడా ప్రారంభించింది. దీంతో మరిన్ని ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశమున్నది.
సేవల రంగంలోనూ మిన్న
సేవల రంగం విషయానికొస్తే.. 2022-23, 2023-24లో దేశ సగటు వృద్ధిరేటు కన్నా తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుంది. దేశ వృద్ధి రేటు 9.5 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు 14.6 శాతంగా ఉంది. స్థూల రాష్ట్ర విలువ జోడింపు(జీఎస్వీఏ)లో సేవల రంగం ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, టూరిజం తదితర రంగాలు ఆధునిక సాంకేతికత, డిజిటలైజేషన్, పెరిగిన గ్లోబల్ కనెక్టివిటీ తదితర అంశాల ఆధారంగా గణనీయ వృద్ధిని నమోదుచేశాయి. 2023-24లో సేవల రంగం రాష్ట్ర జీఎస్డీపీలో 65.70 శాతం(రూ. 8,80,569 కోట్లు) తోడ్పాటును అందించింది. రాష్ట్ర ఆర్థికరంగంలో సేవల రంగం ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. 2022-23, 2023-24లో ట్రేడ్, రిపేర్, హోటల్స్, రెస్టారెంట్స్ తదితర రంగాలు 20.81శాతం వృద్ధిని నమోదుచేశాయి. అలాగే, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ తదితర రంగాలు 15 శాతం వృద్ధిని సాధించాయి.
రాష్ట్రం నుంచి టాప్-5 ఎగుమతుల వివరాలు(రూ. కోట్లలో)
తెలంగాణ సరుకును దిగుమతి చేసుకున్న టాప్-10దేశాలు(శాతాల్లో)
రాష్ట్రం నుంచి ఎగుమతులు చేసిన టాప్-5 జిల్లాలు(రూ. కోట్లలో)