కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 30: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నడ్డిబొడ్డులో శనివారం ఏర్పాటుచేసిన ఆటో షోకు విశేష స్పందన వచ్చింది. మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్‌గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఈ ఎక్స్‌పోకు తొలిరోజు పెద్ద ఎత్తున నగరవాసులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు, 60వ డివిజన్ కార్పొరేటర్ వాల రమణారావు, నమస్తే తెలంగాణ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించి వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ షోలో నయా మాడల్ మారుతి డిజైర్ కారును ఆవిష్కరించి, కొద్దిసేపు నడిపి పరిశీలించారు.
అనంతరం యమహా, ఎస్ఎస్ ఈవో ఎలక్ట్రిక్ వాహనాన్ని నడిపి హర్షం వ్యక్తంచేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు స్టాళ్లను పరిశీలించి, నయా మాడల్ కార్లు, బైక్‌ల గురించి తెలుసుకున్నారు. పలువురు కొత్త వాహనాలను బుక్ చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆటో షో ముగియనున్నది. ఈ కార్యక్రమంలో యాడ్స్ మేనేజర్ మల్లయ్య, నమస్తే తెలంగాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండేలా ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ఆటో షో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మేయర్ యాదగిరి సునీల్‌రావు కొనియాడారు. మార్కెట్లో సరికొత్తగా, ఆధునిక ఫీచర్లతో వస్తున్న వాహనాల మాడళ్లకు, ఈవీ వాహనాలకు సైతం ఆదరణ ఎక్కువగా ఉన్నదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాహనాలను ఎంచుకునే అవకాశంతోపాటు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ ఆటో షోను నగరవాసులు సందర్శించి సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. వివిధ కంపెనీ వాహనాలను ఒకే వేదికపై తెచ్చి, ఆటో షో నిర్వహించడం ఎంతో అభినందనీయమని కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. కొత్త వాహనాలను కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఒకే ప్రాంతంలో అనేక కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం నమస్తే తెలంగాణ నగర ప్రజలకు కల్పించిందని చెప్పారు.