మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 18:38:29

విద్యుత్ బ‌కాయిల‌పై సీఎం త్వ‌ర‌లోనే నిర్ణయం

విద్యుత్ బ‌కాయిల‌పై సీఎం త్వ‌ర‌లోనే నిర్ణయం

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన విద్యుత్ బ‌కాయిల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. డిస్కంల‌కు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్‌.. డిస్కంలు, పంచాయ‌తీ, మున్సిప‌ల్ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం స‌మావేశం నిర్వహించారు. విద్యుత్ బ‌కాయిల చెల్లింపులతో పాటు పేమెంట్ ఆప్ష‌న్స్ కు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక‌ను వారం రోజుల్లో స‌మ‌ర్పించాల‌ని డిస్కంల‌ను సీఎస్ ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా బ‌కాయిల చెల్లింపుల‌పై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని సీఎస్ స్ప‌ష్టం చేశారు.  

నెల‌వారీ విద్యుత్ బిల్లుల‌ను త‌ప్ప‌కుండా చెల్లించాల‌ని పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌ను సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల విష‌యంలో ఆల‌స్య‌మైతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట నెల రోజుల్లోపు విద్యుత్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేసి, స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని డిస్కంల‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మీట‌ర్ రీడింగ్‌ల ఆధారంగానే విద్యుత్ బిల్లుల‌ను ఇవ్వాల‌న్నారు. విద్యుత్ బిల్లుల‌లో వ్య‌త్యాసాల‌ను ప‌రిష్క‌రించేందుకు పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు, డిస్కంల‌తో సంయుక్త క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. 

ఈ స‌మావేశంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo