ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్‌లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అక్కడున్న పాత్రికేయులు, విశ్లేషకులు అనుకోవడం వినిపించింది. గతంలో ఒకట్రెండుసార్లు ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ.. ఒకట్రెండు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు పరిమితమయ్యేవారు. కానీ, వెనుకబడిన ఈ ప్రాంతానికి ప్రయోజనం కల్గించేలా సీఎం కేసీఆర్ అత్యంత ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేయడంతో ఈ ప్రాంతం పులకించిపోయింది. సాగునీటికోసం దశాబ్దాలుగా పడిన గోసలు.. ఇక మటుమాయం కానున్నాయన్న ఆనందం వారి కండ్లల్లో తొణికిసలాడింది. పడావు పడిన భూములు ఇకపై పచ్చదనంతో వెల్లివిరుస్తాయన్న సంతోషం పెల్లుబికింది. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా.. మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు నారాయణఖేడ్, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున ప్రకటించిన సీఎం.. హరీశ్‌రావు మంచి హుషారున్న మంత్రి అంటూ ప్రశంసించారు. నాయకులు అట్లనే ఉండాలని, అట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొన్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం ఢిల్లీదాకా కొట్లాడుదామంటూ దేశం కోసం నవసందేశం ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో ఇకపై కీలకపాత్ర పోషిస్తానని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే దుర్మార్గమైన పరిస్థితి ఉన్నదని.. దీన్ని తరిమికొట్టాలని పేర్కొన్నారు. అద్భుత వనరులు, యువశక్తి ఉన్న భారత్‌కే.. అమెరికా సహా ఇతర దేశాలనుంచి వీసాలు తీసుకొని వచ్చేలా గొప్ప దేశాన్ని నిర్మించవచ్చని చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశాన్ని బాగుచేసుకొందాం
ఈ మధ్య మీరంతా పేపర్లలో, టీవీల్లో చూస్తున్నరు.. నేను జాతీయ రాజకీయాల్లోకి కూడా పోయి మాట్లాడుతున్న. ఎట్లయితే తెలంగాణను బాగు చేసుకొన్నమో.. అదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ దేశాన్ని అమెరికాకంటే గొప్పదేశంగా తయారుచేసేలా ముందుకు వెళ్లాలి. అమెరికా పోవడం కాదు.. ఇతర దేశాలే వీసా తీసుకొని భారత్‌కు వచ్చే పరిస్థితి తెచ్చేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టే నేను పోరాటానికి బయలుదేరిన. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలె. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకొన్నమో.. బంగారు భారతదేశం కూడా చేసుకొందాం. తెలంగాణలో జరుగుతున్న పనులను దేశమంతా కోరుతున్నది. దేశం కూడా బాగుండాలి. దేశం గురించి మనం కూడా కొట్లాడాలి. ఇంకింత మనం పైకి పోయే, బంగారు తునకలాంటి తెలంగాణను తయారుచేసుకొనే అవకాశం ఉంటది. దేశం కూడా గొప్పగా తయారవుతది.
మతాల మధ్య చిచ్చు రాజకీయం
75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత ఉండాల్సిన పద్ధతుల్లో దేశం లేదు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా జరుగుతున్నది. ఇవాళ హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్నది. 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. జహీరాబాద్‌లో నిమ్జ్ వస్తున్నది. దాన్ని త్వరగా పూర్తిచేయాలి. ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మీ ఎంపీ బీబీ పాటిల్ కోరుతున్నారు. జహీరాబాద్ దగ్గర పరిస్థితి బాగుంటుందంటేనే ఎవరైనా వస్తరు. కానీ, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డిల పొద్దున లేస్తే కత్తులు పట్టుకొని పొడుచుకుంటరు.. కర్ఫ్యూ ఉంటది.. పోలీస్ ఫైరింగ్ ఉంటదంటే ఎవరైనా వస్తరా? రారు. అన్ని మతాలు, కులాలు, వర్గాలు బాగుండాలి. ఇంత మంచిగ మనం చేసుకుంట పోతున్నం.
మీ అందరి దీవెనతోనే యుద్ధం చేశా
తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పదిమంది కార్యకర్తలుండేది, ప్రజల్లో పెద్ద ఆశ ఉండేదికాదు. ‘కేసీఆర్ వత్తాండు.. పోతాండు. కానీ వత్తదా తెలంగాణ?’ అనే మాట ఎక్కువగా ఉండే. వేరే పార్టీల వాళ్లు కూడ చాలా కన్ఫ్యూజ్ చేసేది. అందువల్లే తెలంగాణ రాష్ట్రమైతే తప్ప బాగుపడదనే నిర్ణయానికి వచ్చి, మీ అందరి దీవెనతోని, సహకారంతోని యుద్ధం చేసినం. 14 ఏండ్లు కొట్లాడిన తర్వాత చివరికి ఆమరణ దీక్ష పట్టి చావు అంచుదాక పోతే అప్పుడు తెలంగాణ ప్రకటన వచ్చింది. నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్‌లో బాగా విజృంభించారు, అందోల్ ప్రాంతం కూడ ఉద్యమంలో ముందుకురికింది. పట్టువట్టి తెలంగాణ తెచ్చుకొన్నం.
తెలంగాణ చీకటైతదన్న వాళ్ల దగ్గరే కరెంటు లేదు
తెలంగాణ ఏర్పడే ముందు బదనాంలు పెట్టినరు. మీకు కరెంటు రాదు.. చీకటైపోతది. పరిశ్రమలన్నీ తరలిపోతయి.. మీకు పరిపాలన చాతకాదన్నరు. ఎవరైతే మాట్లాడిండ్రో వాళ్ల దగ్గర కరెంటు లేదు. మన తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది. అది మీ దీవెనల బలం.. మీరిచ్చిన శక్తితోనే. రెండోసారి కూడ దీవించి గెలిపించినారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనాయి. శాశ్వతంగా మంచినీళ్ల బాధ పోయింది. దేశంలో రెండువేలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదు. గ్రామాల్లో ధీమా వచ్చింది. పేద ప్రజలకు బియ్యం ఇచ్చేది పెంచుకున్నం. ఆడపిల్ల పెండ్లి అయితే లక్ష రూపాయలు ఇచ్చుకుంటున్నం.వ్యవసాయ రంగంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆరేడేండ్లలో.. ఎంతో సాధించాం
విద్యార్థులు బయటకుపోయి చదువుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇవ్వదు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు విదేశాల్లో చదువుకోవడానికి రూ.20 లక్షలు ఇచ్చేది తెలంగాణ ఒక్కటే. రెసిడెన్షియల్ స్కూల్స్ మీ కండ్ల ముందలన్నయి. వాటిల్లో పిల్లలు బ్రహ్మాండంగా జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో అద్భుత ర్యాంకులు సాధిస్తున్నరు.. ఇది అందరికీ గర్వకారణం. ఆరేడేండ్లల్లో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో మీ అందరికీ తెలుసు. అనేక రంగాల్లో దేశంలో నంబర్‌వన్‌గా ఉన్నది.
సంగమేశ్వర, బసవేశ్వరతో పొలాలన్నీ పచ్చగా
ఒకప్పుడు ఎక్కడున్న నారాయణఖేడ్.. ఎక్కడ గోదావరి.. ఎక్కడ మన సింగూరు.. బండారు శ్రీనివాస్‌రావు అని సీనియర్ జర్నలిస్టు నాతోపాటు వచ్చారు. ఆయనకు నేను చూపించాను. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచిలుకు కిలోమీటర్లు లిఫ్ట్‌ల ద్వారా ప్రయాణం చేసి సింగూరుకు నీళ్లు వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీలు నిల్వ ఉండే వరకు నీళ్లు గుంజి మన సంగమేశ్వర బసవేశ్వరకు ఇస్తది. పొలాలన్నీ పచ్చబడ్తయి. బ్రహ్మాండంగా పైకి వెళ్తాం. ఈ కల నిజమైతదని అనుకోలేదు. తెలంగాణ సాధించాం.. కాబట్టి మనం ఇవి సాధ్యం చేసుకోగల్గుతున్నం.
రైతుబంధు, బీమా గురించి మహారాష్ట్ర సీఎం అడిగారు
రైతు చనిపోతే ఒక్క తెలంగాణలో తప్ప.. దేశంలో ఎక్కడా రూ.5 లక్షల బీమా ఇచ్చే ప్రభుత్వం లేదు. రైతుబంధు డబ్బులు కూడా హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి రిలీజ్‌చేస్తే.. రైతుల ఖాతాల్లోకే పడుతున్నయి. నిన్న నేను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నన్ను అడిగారు.. ‘సార్ మీ దగ్గర రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నరట.. సరిహద్దుల్లో ఉండే రైతులు మమ్మల్ని సావకొడుతున్నరు.. ఎట్ల ఇస్తున్నరో మాకు కూడా చెప్పండి.. మేం కూడా అదే పద్ధతిలో రైతుబంధు, రైతుబీమా ఇస్తాం’ అని అన్నరు.