హైదరాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ) : ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోనే ఈ తరహా అత్యుత్తమ ప్రతిభకేంద్రం(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యామంత్రి జూలియన్ హిల్తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎంవోయూ వివరాలు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ అకడమిక్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) ముందుకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలోని ఎడ్యుకేషన్ సిటీలో తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్‌తో భేటీ అయ్యి చర్చలు జరిపారు.